ముగిసిన మహా కుంభాభిషేక మహోత్సవాలు..

ముగిసిన మహా కుంభాభిషేక మహోత్సవాలు..
ఇంద్రాకిలాద్రి పై ఆధ్యాత్మిక శోభ
కంచి జగద్గురువుల అమృతహస్తాలతో గోపుర సంప్రోక్షణ.. జయజయధ్వానాలతో మార్మోగిన దుర్గగుడి
ఇంద్రాకిలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడ లోని ఇంద్రాకిలాద్రి పై కొలువై ఉన్న కనక దుర్గ టెంపుల్ లో గత మూడు రోజులుగా అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించిన మహా కుంభాభిషేక మహోత్సవాలు ఆదివారం అంగరంగ వైభవంగా ముగిశాయి. లోకక్షేమం, విశ్వశాంతి కోసం చేపట్టిన ఈ పవిత్ర క్రతువు వేదమంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నినాదాలు, భక్తుల జయజయధ్వానాల మధ్య ప్రశాంత ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా కొనసాగింది. ఆదివారం ఉదయం యాగశాలలో ప్రత్యేక మంటప పూజలు, మూలమంత్ర హోమాలతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం ఉదయం 9 గంటలకు నిర్వహించిన పూర్ణాహుతితో యాగం పరిసమాప్తమైంది.
తరువాత నిర్ణీత మేషలగ్న పుష్కర ముహూర్తంలో ఉదయం 9:34 గంటలకు శంకర విజయంద్ర సరస్వతి అమృతహస్తాలతో ఆలయ ప్రధాన శిఖర విమాన గోపురంపై కుంభాభిషేకం నిర్వహించారు. దేశవ్యాప్తంగా పుణ్యనదుల నుండి తీసుకువచ్చిన పవిత్ర జలాలు, సముద్రోదకంతో నిర్వహించిన సంప్రోక్షణ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన భక్తులు భక్తి పారవశ్యంతో పులకించిపోయారు. గోపుర శిఖరంపై జలాభిషేకం జరుగుతుండగా ఆలయ ప్రాంగణం అంతా ‘అమ్మవారి జై’ నినాదాలతో మార్మోగింది. ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి డా. ఎం.హరి జవహర్ లాల్, దేవాదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ తదితరులు కూడా హాజరయ్యారు.

ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), కార్యనిర్వహణాధికారి వి.కె.శీనా నాయక్ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఏర్పాట్లు నిర్వహించారు. ప్రధాన అర్చకులు, ఉప ప్రధాన అర్చకులు, వైదిక కమిటీ సభ్యులు, వేద పండితులు శాస్త్రోక్తంగా అన్ని పూజా కార్యక్రమాలను నిర్వహించారు. కుంభాభిషేకం అనంతరం రాజగోపురం ప్రాంగణంలోని కళావేదికపై కంచి పీఠాధిపతి జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి అనుగ్రహ భాషణం చేశారు. ఆలయాలలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే కుంభాభిషేకం ఆలయ తేజస్సును పునరుద్ధరించే మహత్తర ఆధ్యాత్మిక క్రతువని వివరించారు. ఈ మహోత్సవం ద్వారా దేవాలయ ఆధ్యాత్మిక శక్తి పునరుద్ధరించబడుతుందని, భక్తులకు మరింత దైవానుగ్రహం లభిస్తుందని పేర్కొన్నారు.
మహోత్సవాల సందర్భంగా వేలాది మంది భక్తులు తరలివచ్చే నేపథ్యంలో భద్రత, తాగునీరు, దర్శన ఏర్పాట్లు, వైద్య సేవలు, రవాణా వంటి అంశాల్లో ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం చేసుకునేలా ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. ముగింపు సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు లభించాలని ఆకాంక్షించారు. ఈ కుంభాభిషేక మహోత్సవం ద్వారా ఆలయ మహిమ, తేజస్సు మరింత పెరిగిందని తెలిపారు. వేలాది మంది భక్తుల సమక్షంలో ప్రశాంత ఆధ్యాత్మిక వాతావరణంలో మహోత్సవాలు విజయవంతంగా ముగిశాయి.
