ఖతార్ మాజీ ఎమిర్ మృతిపై ప్రధాని మోదీ సంతాపం
- ‘విజనరీ లీడర్‌ను కోల్పోయాం’..
- షేక్ హమద్‌కు మోదీ నివాళి
ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ : ఖతార్ మాజీ ఎమిర్ (ఫాదర్ ఎమిర్) షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ (74) మరణంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఖతార్‌ను ఆధునిక, అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో ఆయన కీలక పాత్ర పోషించిన విజనరీ నాయకుడని కొనియాడారు. ఖతార్ రాజ కుటుంబ కార్యాలయం అమిరీ దివాన్ అధికారికంగా షేక్ హమద్ మరణాన్ని ప్రకటించింది. దేశాభివృద్ధికి ఆయన చేసిన విశిష్ట సేవలను స్మరించుకుంటూ సంతాపం తెలిపింది.
‘ఆయనను నిజమైన మిత్రుడిగా గుర్తుంచుకుంటాం’
ప్రధాని మోదీ తన ‘ఎక్స్’ ఖాతాలో స్పందిస్తూ, 2024 ఫిబ్రవరిలో ఖతార్ పర్యటన సందర్భంగా షేక్ హమద్‌ను కలిసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. “ఖతార్ ఫాదర్ ఎమిర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ మరణం తీవ్ర విచారాన్ని కలిగించింది. ఖతార్‌ను అద్భుతమైన అభివృద్ధి, సంపన్నత వైపు నడిపించిన విజనరీ నాయకుడు ఆయన. ఆయనను నిజమైన మిత్రుడిగా గుర్తుంచుకుంటాం” అని మోదీ పేర్కొన్నారు. అలాగే ప్రస్తుత ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ, రాజ కుటుంబ సభ్యులు, ఖతార్ ప్రజలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఆధునిక ఖతార్ రూపశిల్పి
1995 నుంచి 2013 వరకు ఖతార్ పాలకుడిగా ఉన్న షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ, సహజ వాయువు, ఇంధన వనరులను సమర్థంగా వినియోగించి దేశాన్ని ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశాల్లో ఒకటిగా తీర్చిదిద్దారు. ఆయన పాలనలోనే ఖతార్‌లో ఆర్థిక, సామాజిక, విద్యా, మౌలిక సదుపాయాల రంగాల్లో వేగవంతమైన అభివృద్ధి జరిగింది. అంతర్జాతీయ వేదికపై ఖతార్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. షేక్ హమద్ హయాంలోనే 2004లో ఖతార్‌కు తొలి శాశ్వత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. మున్సిపల్ ఎన్నికలను ప్రవేశపెట్టడంతో పాటు మహిళలకు ఓటు హక్కు, ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కల్పించడం వంటి కీలక సంస్కరణలు చేపట్టారు.
