1stAprileditorial | ఇరాన్ యుద్ధం.. ప్రపంచం పై ఆర్థిక ప్రభావం..

1stAprileditorial | ఇరాన్ యుద్ధం.. ప్రపంచం పై ఆర్థిక ప్రభావం..

1stAprileditorial | ఇరాన్ యుద్ధంలో ట్రంప్ అంచనాలు తప్పాయి
హార్మూజ్ జలసంధి వ్యూహంతో ఇరాన్ చెక్
నాటో, యూరప్ దేశాల మద్దతు లేకపోవడం
ప్రపంచ చమురు ధరల పెరుగుదల ప్రభావం
అమెరికాలో నో కింగ్స్ నిరసనలు
పెట్రోల్ ధరల పెరుగుదలతో ప్రజా వ్యతిరేకత
ట్రంప్‌ పై దేశీయ, అంతర్జాతీయ ఒత్తిడి

1stAprileditorial | ఇరాన్ పై యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంచనాలు తప్పాయి. అనుకున్నదొకటి.. అవుతున్నది మరొకటిగా పరిస్థితి మారిపోయింది. యుద్ధం ప్రారంభమై నెలదాటిపోయినా ఫలితం దక్కలేదు. పైగా వ్యతిరేకత పెరుగుతోంది. పదుల సంఖ్యలో ఇరాన్ అగ్రనేతలను, సైనికాధికారులు, ఉన్నత స్థాయి వ్యక్తులను హతమార్చినప్పటికీ టెహ్రాన్ దారికి రావడం లేదు. పైగా హార్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలను నియంత్రించడం ద్వారా ట్రంప్కు ఇరాన్ చెక్ చెప్పింది. ప్రపంచ చమురు రవాణాలో 20 శాతం ఈ జలసంధి ద్వారానే జరగాల్సి ఉండగా నౌకలు నిలిచిపోవడంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రభావం పడింది. అన్నిచోట్లా చమురు ధరలు భారీగా పెరిగాయి. ఇక్కడే ఇరాన్ వ్యూహం అద్భుతంగా పని చేసింది. అణ్వాయుధాల తయారు చేస్తోందన్న నెపంతో యుద్ధం ప్రారంభించిన ట్రంప్… ఇప్పుడు కక్కలేని, మింగలేని సంకట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ యుద్ధంలో పాలుపంచుకోవాలన్న ట్రంప్ పిలుపును నాటో తోసిపుచ్చింది.

మిత్రదేశాలు కూడా కలసి రావడం లేదు. ఇరాన్పై యుద్ధంలో పాల్గొనే యుద్ధవిమానాలను తమ గగన తలంలోకి అనుమతించబోమని మొన్న స్పెయిన్ రక్షణమంత్రి మార్గరెటా రొబెల్స్ ప్రకటించగా నిన్న ఇటలీ అదే బాటను ఎంచుకుంది. తమ దేశంలోని సిసిలీ వైమానిక స్థావరాన్ని యుద్ధావసరాలకు వినియోగించడానికి అంగీకరించబోమని తెగేసి చెప్పింది. తాజాగా బ్రిటన్, ఫ్రాన్స్క కూడా తమ తమ గగనతలాన్ని, వైమానిక స్థావరాలను అమెరికా- ఇజ్రాయెల్ వాడుకోవడానికి నో చెప్పాయి. ఈ పరిస్థితుల్లో హార్మూజ్పై వెనక్కుతగ్గి యుద్ధాన్ని విరమించాలని ట్రంప్ భావిస్తున్నప్పటికీ.. హార్మూజ్ విషయంలో దీర్ఘకాల పరిష్కారం సాధించే వరకు యుద్ధం కొనసాగించాలని గల్ఫ్ దేశాలు, ఇజ్రాయెల్ వత్తిడి తెస్తున్నాయి. కానీ ట్రంపు మరో సమస్య ఎదురవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో ఆర్థిక రంగం దెబ్బతింటోంది. ధరలు పెరుగుతున్నాయి. ద్రవ్యోల్బణం భయపెడుతోంది.

స్వదేశంలో వ్యతిరేకత ఎదురవుతోంది. శనివారంనాడు అమెరికాలోని 50 రాష్ట్రాలలో 3 వేల చోట్ల నో కింగ్స్ నిరసనలను చూస్తే అర్థమవుతుంది. అకారణంగా, అనవసరంగా ఇరాన్పై యుద్ధానికి దిగారని అమెరికన్లు భావిస్తున్నారు. అస్థిర విధానాలు, వలస విధానాలు, ధరల పెరుగుదల వంటి విషయాల్లోనూ తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. ఇరాన్పై యుద్ధం నేపథ్యంలో అమెరికాలో చమురు ధరలు ఆకాశాన్ని అంటాయి. యుద్ధానికి ముందు, అంటే, ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికాలో గ్యాలన్ పెట్రోల్ ధర 2.90 నుంచి 3.00 డాలర్లుండగా ప్రస్తుతం (మార్చి 31నాటికి) గ్యాలన్ పెట్రోల్ ధర 4 నుంచి 4.02 డాలర్లకు చేరుకుంది. అంటే, గ్యాలన్పై 35 నుంచి 40 శాతం పెరిగిందన్నమాట. డీజిల్ ఏకంగా గ్యాలన్ 5.25 డాలర్ల మార్క్ దాటింది. ఏతావాతా అమెరికాలో ప్రతి కుటుంబం ఏటా 700 నుంచి 800 డాలర్లు అదనపు భారాన్ని మోయాల్సి వస్తుంది. ఇది ట్రంప్పై ప్రజావ్యతిరేకతకు కారణమైంది. అయినా, అస్థిర విధానాలు, బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తున్న ట్రంప్ ఇంకా మార్పు రాలేదు. యుద్ధం కొనసాగుతున్నకొద్దీ ట్రంప్కు దేశీయంగాను, ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడి పెరగడం ఖాయం.

Leave a Reply