Chiranjeevi |చిన్నారి అభిమానికి మెగా సర్‌ప్రైజ్‌

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: అభిమానుల ప్రేమకు ఎప్పుడూ మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక విలువను ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా చిన్నారులంటే ఆయనకు ఉన్న మమకారం ఎన్నో సందర్భాల్లో బయటపడింది. అందుకే ఎన్ని తరాలు మారుతున్నా చిన్నారుల్లో మెగాస్టార్‌ క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు.

తాజాగా తన పుట్టినరోజు సందర్భంగా చిరంజీవిని కలిసేందుకు వచ్చిన ఓ చిన్నారి అభిమానితో ఆయన ఎంతో ఆప్యాయంగా గడిపారు. చిన్నారిని ప్రేమగా పలకరించి ఆశీర్వదించిన మెగాస్టార్, జ్ఞాపకంగా ఓ చేతి గడియారాన్ని బహుమతిగా అందించి ఆనందపరిచారు.

అనుకోకుండా మెగాస్టార్ చేతుల మీదుగా బహుమతి అందుకోవడంతో చిన్నారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ దృశ్యాలు అక్కడున్న వారిని కూడా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండగా, చిరంజీవి అభిమానులు ఆయన పెద్ద మనసును ప్రశంసిస్తున్నారు.

సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ అభిమానుల పట్ల ప్రేమ, ఆప్యాయత చూపడంలో చిరంజీవి మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.