విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసేందుకు ప్రభుత్వం కుట్ర: ఏబీవీపీ
పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ బండి రాజశేఖర్ ఆరోపించారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకంపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఈ నెల 14న రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ కళాశాలల నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు అన్ని విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో సుమారు 20 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్‌లపై ఆధారపడి చదువుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంతో రూ.11,000 కోట్ల బకాయిలు పేరుకుపోయాయని, ప్రతి ఏడాది రెండు లక్షల మంది విద్యార్థులు చదువును మధ్యలోనే నిలిపివేస్తుండగా, మరో 4.5 లక్షల మంది సర్టిఫికెట్లు పొందలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
ఎన్నికల సమయంలో ప్రతి నెల ఫీజులు చెల్లిస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికీ బకాయిలు విడుదల చేయకపోవడం బాధాకరమని బండి రాజశేఖర్ విమర్శించారు. హక్కుల కోసం పోరాడుతున్న విద్యార్థులపై లాఠీచార్జీలు చేసి అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, లేనిపక్షంలో విద్యాసంస్థలు మరోసారి ఉద్యమ వేదికలుగా మారుతాయని హెచ్చరించారు. ఈ నెల 14న నిర్వహించే రాష్ట్రవ్యాప్త బంద్‌ను విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఏబీవీపీ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ అరవింద్, నగర ఉపాధ్యక్షుడు విగ్నేష్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.
