Kaleshwaram Barrages | కాంగ్రెస్ ప్రభుత్వానిది ఘోర వైఫల్యం
కాళేశ్వరం పునరుద్ధరణపై రేవంత్‌కు బీజేపీ లేఖ
బ్యారేజీల మరమ్మతుల్లో ప్రభుత్వం విఫలమైందని ఆరోపణ..
ఎన్‌డీఎస్‌ఏ నివేదికలను పట్టించుకోలేదంటూ రామచందర్‌రావు విమర్శలు
Kaleshwaram Barrages |ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల పునరుద్ధరణ అంశంపై తెలంగాణ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. లేఖలో కాళేశ్వరం బ్యారేజీల మరమ్మతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆయన ఆరోపించారు. జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ (ఎన్‌డీఎస్‌ఏ) సూచనలు, నివేదికలను పట్టించుకోకుండా వరుసగా మూడు వర్కింగ్ సీజన్లను వృథా చేసిందని విమర్శించారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఉత్తర తెలంగాణ రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీటి సమస్యలు ఎదురవుతున్నాయని రామచందర్‌రావు పేర్కొన్నారు. ఇప్పుడు తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు కేంద్ర కమిటీపై నెపం మోపడం బాధ్యతారాహిత్యమని ఆయన విమర్శించారు. ప్రభుత్వం తన బాధ్యతలను విస్మరించి ఇతరులపై నెపం నెట్టే ప్రయత్నం చేస్తోందని, ఈ పరిణామాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తన లేఖలో పేర్కొన్నారు.
