Meditation | ఆత్మశాంతికి ధ్యానం – జీవన సార్ధకతకు మార్గదర్శకం

Meditation | ఆత్మశాంతికి ధ్యానం – జీవన సార్ధకతకు మార్గదర్శకం

Meditation | నారాయణపేట, ఆంధ్రప్రభ : ఐక్యరాజ్యసమితి ప్రకటించిన అంతర్జాతీయ(International) ధ్యాన దినోత్సవం (వరల్డ్ మెడిటేషన్ డే) సందర్భంగా నారాయణపేట్ జిల్లా ఆధ్యాత్మిక కాంతులతో వెలిగింది. అగ్రహార్‌పేట్‌లోని చారిత్రక ప్రాధాన్యత కలిగిన పురాతన బొప్పలమఠం ప్రాంగణంలో ఈ రోజు పతంజలి యోగ సమితి, నారాయణపేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలు భక్తి, ధ్యాన వాతావరణంలో ఘనంగా సాగాయి.

ఈ పవిత్ర కార్యక్రమానికి గుర్మిట్కల్ ఖాస మఠం పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ గురు మృగ రాజేంద్ర మహాస్వామి(Sri Sri Sri Guru Mruga Rajendra Mahaswami) ముఖ్య అతిథిగా హాజరై ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. స్వామివారు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. “భౌతిక జీవితపు పరుగులో మనిషి తన అంతరంగాన్ని మరిచిపోతున్నాడు.

ధ్యానం అనేది ఆత్మతో సంభాషించే సాధన. దీని ద్వారా మానసిక ప్రశాంతత, ఆత్మబలం, శారీరక ఆరోగ్యం లభిస్తాయి. ప్రతి ఒక్కరూ ధ్యానాన్ని(Meditation) నిత్యజీవితంలో భాగం చేసుకొని జీవనాన్ని సార్ధకం చేసుకోవాలి” అని ఉపదేశించారు. కార్యక్రమంలో బిజెపి సీనియర్ రాష్ట్ర నాయకులు నాగురావు నమాజీ, యోగ గురువు సురేష్ కుమార్, రాజు లాహోటి, రఘువీర్ యాదవ్, బాలప్పతో పాటు నారాయణపేట్ జిల్లా యోగ సమితి సభ్యులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

యోగాసనాలు, ప్రాణాయామం నిర్వహించి, సామూహిక(Group) ధ్యాన కార్యక్రమంలో పాల్గొని ఆధ్యాత్మికానందాన్ని అనుభవించారు. ఈ వేడుకలు సమాజానికి ఒక శాశ్వత సందేశాన్ని ఇచ్చాయి. ధ్యానం అలవాటు చేసుకుంటే మనస్సు ప్రశాంతమవుతుంది, జీవితం ఆరోగ్యవంతంగా మారుతుంది. అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం ప్రతి వ్యక్తిని ఆత్మచింతన వైపు నడిపిస్తూ, మానవ జీవితానికి నిజమైన దిశానిర్దేశం చేస్తుందని పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు.

Leave a Reply