Shabad Murders | వెల్ల‌డించిన ప్రత్యక్ష సాక్షి

షాబాద్ ఆరు హత్యల కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకెళ్లారని సాక్షి వెల్లడి
దర్యాప్తులో కీలక పరిణామం

Shabad Murders | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో జరిగిన సంచలన ఆరు హత్యల కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్‌ను తాను ప్రత్యక్షంగా చూశానని కొత్తూరు మండలం కుమ్మరిగూడెం గ్రామానికి చెందిన బండారు సుధాకర్ వెల్లడించారు. సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. రాజ్‌కుమార్ కుమ్మరిగూడెం ప్రాంతంలో కనిపించగా, తాను గుర్తించిన కొద్దిసేపటికే పోలీసులు అక్కడికి చేరుకుని అతడిని అదుపులోకి తీసుకుని వెళ్లారని చెప్పారు. ఈ ఘటన దర్యాప్తులో కీలక అంశంగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు.

కాగా, షాబాద్ మండలంలోని దైవాలగూడలో జరిగిన ఈ దారుణ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. తనపై పోక్సో కేసు నమోదుకు కారణమయ్యారనే కక్షతో రాజ్‌కుమార్ ఓ మైనర్ బాలికతో పాటు ఆమె కుటుంబ సభ్యులు, అలాగే తన భార్య, పిల్లలను కలిపి మొత్తం ఆరుగురిని హత్య చేసినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు.

ఘటన అనంతరం పరారైన రాజ్‌కుమార్‌ను కొత్తూరు మండలం అక్కివేనిగూడెం సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ కేసులో అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.