Lok-Adalat-Reunites-Couple : విడాకుల కోసం కోర్టుకు వెళ్లారు Andhra {rabha :egal News
Lok-Adalat-Reunites-Couple : విడాకుల కోసం కోర్టుకు వెళ్లారు Andhra {rabha :egal News
- కానీ జరిగినది ఎవరూ ఊహించలేదు!
- విడిపోవాలని వచ్చిన భార్యాభర్తలు
- కలిసి జీవించాలని కోర్టులోనే నిర్ణయం
- పుత్తూరులో హృదయాన్ని హత్తుకున్న ఘటన
- కుటుంబాన్ని కాపాడిన లోక్ అదాలత్
( పుత్తూరు చ ఆంధ్రప్రభ)
Lok-Adalat-Reunites-Couple విడిపోవాలని కోర్టు మెట్లెక్కిన ఆ జంట… కలిసి జీవించాలని చేతులు కలిపి తిరిగి ఇంటిబాట పట్టింది. మనస్పర్థలతో దూరమైన రెండు మనసులను న్యాయస్థానం కౌన్సెలింగ్‌తో దగ్గర చేసింది. శనివారం పుత్తూరు కోర్టు ఆవరణలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ ఓ కుటుంబంలో మళ్లీ ఆనందాన్ని నింపింది.

పుత్తూరు పట్టణంలోని ముద్దుకృష్ణాపురానికి చెందిన గిరిబాబు, తేజస్విని పదేళ్ల క్రితం వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కొంతకాలం సాఫీగా సాగిన వారి సంసారంలో మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. అవి క్రమంగా పెరిగి ఇద్దరి మధ్య దూరాన్ని పెంచాయి. చివరకు ఏడాది క్రితం విడాకులు కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
అయితే… పదేళ్ల వైవాహిక బంధం అలా ముగిసిపోకూడదని భావించిన సివిల్ జడ్జి రాఘవేంద్ర వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. జీవితంలో ఎదురయ్యే చిన్నచిన్న మనస్పర్థల కారణంగా కుటుంబ బంధాలను తెంచుకోవద్దని, పరస్పర అవగాహనతో సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.
ఆ మాటలు ఆ దంపతుల మనసులను కదిలించాయి. గతాన్ని పక్కనపెట్టి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. విడాకుల కోసం కోర్టుకు వచ్చిన ఆ ఇద్దరూ… మళ్లీ దంపతులుగా కలిసి జీవించేందుకు అంగీకరించారు.
విడదీసే తీర్పు కోసం వచ్చిన వారికి… కలిసి నడిచే దారి చూపింది లోక్ అదాలత్. పదేళ్ల బంధానికి మళ్లీ కొత్త ఊపిరి పోసి, రెండు మనసులను ఒక్కటి చేసిన ఈ ఘటన అక్కడున్న వారిని ఆనందానికి గురిచేసింది.
