‘సర్’ సర్వే డిజిటలైజేషన్‌ను పారదర్శకంగా పూర్తి చేయాలి
గడువులోగా ఓటరు జాబితా సవరణ పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ భుజంగరావు ఆదేశం
బాల్కొండ, ఆంధ్రప్రభ : కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని పారదర్శకంగా, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) భుజంగరావు అధికారులను ఆదేశించారు.
శనివారం బాల్కొండ, కిసాన్‌నగర్, పోచంపాడ్ గ్రామపంచాయతీలలో ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించి, బూత్ లెవల్ అధికారులతో సర్వే పురోగతిని సమీక్షించారు. ఓటరు జాబితాను తప్పులులేకుండా, పారదర్శకంగా రూపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
బీఎల్వోలు ఇంటింటికి వెళ్లి ఓటరు వివరాలను సేకరిస్తున్నందున ప్రజలు పూర్తి సహకారం అందించాలని కోరారు. అర్హులైన ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి తప్పిపోకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఓటరు జాబితా సవరణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో బాల్కొండ ఈఆర్వో, తహసీల్దార్ శ్రీనివాస్, సర్పంచ్ గాండ్ల రాజేష్, ఉపసర్పంచ్ గాండ్ల రాజేందర్, ఆర్ఐ గంగాధర్, పంచాయతీ కార్యదర్శి మోహన్, బీఎల్వోలు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
