ఉరవకొండలో ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్ త్వరలో అందుబాటులోకి

ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్‌లను త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఆదేశించిన నేపథ్యంలో, ఉరవకొండలోని ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్‌ను కూడా త్వరలో ప్రారంభించనున్నట్లు ఉరవకొండ వ్యవసాయ డివిజన్ సహాయ సంచాలకులు సత్యనారాయణ తెలిపారు.

శుక్రవారం ఆయన ల్యాబ్‌ను పరిశీలించి, అక్కడ ఏర్పాటు చేసిన పరికరాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అందేలా వాటి నాణ్యతను శాస్త్రీయంగా పరీక్షించి ధ్రువీకరించడమే ఈ ల్యాబ్ ప్రధాన ఉద్దేశమని చెప్పారు. నకిలీ విత్తనాలు, ఎరువుల నియంత్రణతో పాటు మట్టి, నీటి నమూనాల పరీక్షలు కూడా ఇక్కడ నిర్వహిస్తామని వివరించారు.

విత్తనాల మొలక శాతం, తేమ శాతం, జన్యు స్వచ్ఛత పరీక్షలతో పాటు ఎరువుల్లో నత్రజని, భాస్వరం, పొటాషియం వంటి పోషకాల విశ్లేషణ కూడా ఈ ల్యాబ్‌లో చేపట్టనున్నట్లు తెలిపారు. రైతులు, రైతు సేవా కేంద్రాలు, వ్యాపార సంస్థల నుంచి సేకరించిన నమూనాలతో పాటు అధికారిక నమూనాలను కూడా పరీక్షించనున్నట్లు వెల్లడించారు.

ల్యాబ్ నిర్వహణకు అవసరమైన రసాయనాలు, నిర్వహణ వ్యయానికి సంబంధించిన బడ్జెట్ విడుదలైన వెంటనే సేవలను పూర్తిస్థాయిలో ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రామకృష్ణుడు, జూనియర్ అనలిస్టులు ప్రియాంక, రామన్న తదితరులు పాల్గొన్నారు.