రేగొండలో బస్టాండ్ నిర్మాణం పూర్తి చేయాలి: ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్

రేగొండ, ఆంధ్రప్రభ : భూపాలపల్లి నియోజకవర్గంలోని రేగొండ మండల కేంద్రంలో బస్టాండ్ లేకపోవడంతో ప్రయాణికులు ఎన్నో ఏళ్లుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్వీనర్ నాగుల అరవింద్ అన్నారు.

శుక్రవారం ఆయన మాట్లాడుతూ, మండల కేంద్రంలో బస్టాండ్ లేకపోవడంతో ప్రయాణికులు ఎండ, వానలో రోడ్డుపైనే బస్సుల కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. గత పాలకులతో పాటు స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కూడా ఈ సమస్యను పట్టించుకోకపోవడం విచారకరమని విమర్శించారు.

ప్రధాన హైవేపై నిత్యం భారీ వాహనాల రాకపోకలు కొనసాగుతున్నందున రోడ్డుపై నిలబడి బస్సుల కోసం ఎదురుచూసే ప్రయాణికులకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని అన్నారు. అయినప్పటికీ ప్రజల భద్రతపై దృష్టి సారించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు.

ఎమ్మెల్యేగా ఎన్నికై రెండున్నర సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ బస్టాండ్ నిర్మాణం పూర్తి కాకపోవడం ఆయన పనితీరుకు నిదర్శనమని విమర్శించారు.

ఇప్పటికైనా ప్రజా సమస్యలపై స్పందించి రేగొండ మండల కేంద్రంలో బస్టాండ్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలతో కలిసి ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోశాధికారి వాసాల శ్రావణ్ కుమార్, పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు, ప్రయాణికులు పాల్గొన్నారు.