వినియోగదారులకు మరింత నాణ్యమైన సేవలు అందించాలి

  • టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి

మంగపేట, ఆంధ్రప్రభ : వినియోగదారులకు మరింత నాణ్యమైన సేవలు అందించాలని టీజీఎన్‌పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి ( ఐఏఎస్ ) విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. ములుగు సర్కిల్‌లోని ఏటూరునాగారం డివిజన్‌లో టీజీఎన్‌పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి శుక్రవారం విస్తృతంగా పర్యటించి విద్యుత్ సరఫరా వ్యవస్థ పనితీరును పరిశీలించి, ఏటూరునాగారం డివిజన్‌లో ఫీడర్ల పని తీరుపై సమీక్ష నిర్వహించారు.

విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తగ్గించి వినియోగదారులకు మరింత నాణ్యమైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఫీడర్ల పని తీరు, ట్రిప్పింగ్స్ పరిస్థితి, అటవీ ప్రాంతాల్లో లైన్ల భద్రత తదితర అంశాలపై సమగ్రంగా ఆధికారులను అడిగి తెలుసుకున్నారు. 33 కేవీ, 11 కేవీ ఫీడర్లలో తరచూ సంభవిస్తున్న అంతరాయాలు, ట్రిప్పింగ్స్ కు గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వినియోగదారులకు నాణ్యమైన, అంతరాయరహిత విద్యుత్ సరఫరా అందించే దిశగా తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమస్యాత్మక ఫీడర్లపై 14 రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

132/33 కేవీ కమలాపురం సబ్‌స్టేషన్‌ను సందర్శించి, అక్కడి నుంచి విద్యుత్ సరఫరా అయ్యే 33 కేవీ మంగపేట, మల్లూరు ఫీడర్లలో తరచూ చోటుచేసుకుంటున్న ట్రిప్పింగ్స్‌కు గల కారణాలను సంబంధిత ఆధికారులను అడిగి తెలుసుకున్నారు. సమస్యాత్మక ఫీడర్లపై ప్రత్యేక దృష్టి సారించి, అంతరాయాల మూలకారణాలను గుర్తించి నివారణ చర్యలు వేగవంతం చేయాలని సూచించారు.132/33 కేవీ కమలాపురం నుంచి 33/11 కెవి మల్లూరు వరకు కొత్తగా వేసిన ఇంటర్ లింకింగ్ లైన్ ను పరిశీలించి వినియోగంలోకి తీసుకు రావాలని ఆదేశించారు.

33/11 కెవి మంగపేట సబ్‌స్టేషన్‌ను సందర్శించి లాగ్‌బుక్‌ను పరిశీలించి 11 కేవీ ఫీడర్లలో తరచూ సంభవిస్తున్న అంతరాయాలపై ఫీల్డ్ సిబ్బందితో నేరుగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పునరావృతమవుతున్న అంతరాయాలకు కారణమవుతున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి 14 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని, ఆ ప్రణాళికలో పేర్కొన్న పనులను నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని డీఈని ఆదేశించారు. 33/11 కెవి మల్లూరు సబ్‌స్టేషన్‌ను పరిశీలించి అక్కడ కొనసాగుతున్న రియల్ టైం ఫీడర్ మానిటర్ పనుల పురోగతిని సమీక్షించారు.

వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సరఫరా అందించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను అత్యంత త్వరగా పూర్తి చేయాలని నిర్మాణ విభాగం డీఈకి సూచించారు. నాణ్యమైన , మెరుగైన విద్యుత్ సరఫరాలో అందించడం టీజీఎన్‌పీడీసీఎల్ ప్రధాన లక్ష్యమని, ఫీల్డ్ స్థాయిలో అధికారులు సమస్యాత్మక ఫీడర్లపై ప్రత్యేక దృష్టి పెట్టి, వినియోగదారులకు అంతరాయరహిత విద్యుత్ అందించే దిశగా వేగంగా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు . ఈ కార్యక్రమంలో ములుగు ఎస్ఈ ఆపరేషన్ బిక్షపతి, టెక్నికల్ డీఈ భాస్కర్, ఏటూరునాగారం డీఈ ఆపరేషన్ జె. పురుషోత్తం, ఏటూరునాగారం ఏడీఈ ఆపరేషన్ బి.ఉమారావు, మంగపేట, ఏటూరునాగారం, తాడ్వాయి మండలాలకు చెందిన విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.