ఆయిల్ పామ్ సాగుపై అవగాహన సదస్సులు..
మెండోరా, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మెండోరా మండలంలోని మెండోరా, బుస్సాపూర్ రైతు వేదికలలో వ్యవసాయ మరియు ఉద్యాన శాఖల ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ సాగుపై అవగాహన సదస్సులు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేల్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్తింటి ముత్యంరెడ్డి హాజరై మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయిల్ పామ్ సాగు పథకంలో రైతులందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. దేశ అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక చొరవతో రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెరిగిందని తెలిపారు.
బాల్కొండ డివిజన్ ఉద్యాన శాఖ అధికారి రుద్ర వినాయక్ ఆయిల్ పామ్ సాగు విధానాలు, ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు, మార్కెటింగ్ అవకాశాలపై ప్రజెంటేషన్ ద్వారా రైతులకు వివరించారు. రైతుల సందేహాలను నివృత్తి చేశారు.మండల వ్యవసాయాధికారి వసంత్ మాట్లాడుతూ, మండలంలో వరి విస్తీర్ణం అధికంగా ఉన్నందున రైతాంగం పంట మార్పిడి దిశగా ఆలోచించాలని, ముఖ్యంగా బుస్సాపూర్ ప్రాంతంలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాలని సూచించారు.
బుస్సాపూర్ సర్పంచ్ నూతుపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో ఈ పంట సాగును మరింత విస్తృతంగా చేపట్టాలని కోరారు.ఈ సందర్భంగా ఇదివరకే ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులను సన్మానించారు.ఈ కార్యక్రమంలో సావెల్ సొసైటీ చైర్మన్ రాజారెడ్డి, మండల తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, విస్తరణాధికారులు భూమేశ్వర్, సంధ్యరేఖ, సచిన్, ఎఫ్‌పీఓ చైర్మన్ సాయిరెడ్డి, రైతులు, ప్రియునిక్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.
