ఎస్ఐఆర్ నమోదు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలి
ఊట్కూర్, ఆంధ్రప్రభ: ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) నమోదు ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా వేగవంతంగా పూర్తి చేయాలని ఊట్కూర్ తహసీల్దార్ అశోక్ కుమార్ సూచించారు. శుక్రవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని ఎడవెల్లి, చిన్నపోర్ల, పెద్దపోర్ల గ్రామాల్లో కొనసాగుతున్న ఎస్ఐఆర్ నమోదు ప్రక్రియను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా అధికారులు, సిబ్బందికి దరఖాస్తులను నిబంధనల ప్రకారం పరిశీలించి అర్హుల వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని, ప్రక్రియను నిర్ణీత గడువులో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బీఎల్వోలు, బీఎల్ఏలు బాధ్యతాయుతంగా వ్యవహరించి నమోదు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.
ఆన్లైన్ నమోదు ప్రక్రియను వేగవంతం చేసి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ చింతా రవి, సీనియర్ అసిస్టెంట్ రాఘవేంద్రారెడ్డి, ఆర్ఐలు కృష్ణారెడ్డి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
