జిల్లా వ్యాప్తంగా డాబాలు, లాడ్జీలపై తనిఖీలు
అక్రమాలకు అడ్డుకట్టే లక్ష్యంతో జిల్లా పోలీసుల ప్రత్యేక డ్రైవ్
సీసీటీవీలు, అతిథుల నమోదు, భద్రతా ప్రమాణాలపై క్షుణ్ణంగా పరిశీలన
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ: జిల్లా వ్యాప్తంగా డాబాలు, లాడ్జీలపై జిల్లా పోలీసులు శుక్రవారం విస్తృత స్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో ప్రధాన రహదారులు, జాతీయ రహదారులు, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని డాబాలు, హోటళ్లు, రోడ్డు పక్కన ఉన్న భోజనశాలలు, లాడ్జీలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. లాడ్జీల్లో బస చేస్తున్న అతిథుల నమోదు వివరాలు, గుర్తింపు పత్రాలు, సిబ్బంది వివరాలు, పార్కింగ్ సదుపాయాలు, సీసీటీవీ కెమెరాలు, రాత్రి వేళల్లో లైటింగ్ వ్యవస్థ తదితర అంశాలను పరిశీలించారు.
డాబాలు, లాడ్జీలను అక్రమ కార్యకలాపాలకు కేంద్రాలుగా మారకుండా నిరోధించడం, మత్తు పదార్థాల వినియోగం, అక్రమ రవాణాపై నిఘా పెంచడం, మహిళలు, ప్రయాణికులకు సురక్షిత వాతావరణం కల్పించడం, రహదారి ప్రమాదాల నివారణే ఈ ప్రత్యేక తనిఖీల లక్ష్యమని పోలీసులు తెలిపారు. రాత్రి వేళల్లో అనవసరంగా గుంపులు గుమిగూడకుండా చూడాలని యజమానులకు సూచించారు.
ఈ సందర్భంగా ప్రతి డాబా, లాడ్జీలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి అవి నిరంతరం పనిచేసేలా చూడాలని, సిబ్బంది వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయాలని, మద్యం సేవించడం, మత్తు పదార్థాల వినియోగం, జూదం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు అవకాశం కల్పించవద్దని పోలీసులు ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన యజమానులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
