Car Crash | నటుడు ధర్మ ఇంట్లోకి దూసుకెళ్లిన కారు..
తృటిలో తప్పిన ప్రమాదం
Car Crash | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ నటుడు ధర్మ నివాసం దెబ్బతింది. అతివేగంగా వచ్చిన ఓ కారు అదుపుతప్పి ఆయన ఇంటి గేటు, ప్రహారీ గోడను ఢీకొట్టి ఇంటి ప్రాంగణంలోకి దూసుకెళ్లింది.
ప్రమాద సమయంలో ఇంట్లో కుటుంబ సభ్యులు ఉన్నప్పటికీ ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఇంటి గేటు, ప్రహారీ గోడకు తీవ్ర నష్టం వాటిల్లింది.
స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కారులో ఉన్న యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రమాద సమయంలో వారు మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ధర్మ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. యువకులు మద్యం సేవించి వాహనం నడిపారా అనే కోణంలోనూ విచారణ కొనసాగుతోంది.
