ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ బాధ్యతగా విధులు నిర్వర్తించాలి

  • జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే

సిరిసిల్ల టౌన్, ఆంధ్రప్రభ : ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ.. బాధ్యతగా విధులు నిర్వర్తించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే పేర్కొన్నారు. శుక్రవారం పోలీస్ స్టేషన్ల పనితీరు, నేరాల దర్యాప్తు పురోగతి, ప్రజలకు అందిస్తున్న సేవలను నిరంతరం పర్యవేక్షణలో భాగంగా జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే వీర్నపల్లి పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిధిలో నమోదైన కేసులు, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతి, స్టేషన్ రికార్డుల నిర్వహణ, సిబ్బంది హాజరు, పెట్రోలింగ్ నిర్వహణ, రౌడీషీటర్లు, పాత నేరస్తులపై నిఘా తదితర అంశాలను క్షుణ్ణంగా సమీక్షించి, ప్రజలకు అందిస్తున్న పోలీసు సేవలపై ప్రత్యేకంగా ఆరా తీశారు.

ప్రజా భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యంగా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే అధికారులకు సూచించారు.ప్రజల్లో భద్రతాభావాన్ని మరింత పెంపొందించె లా విజిబుల్ పోలీసింగ్ను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు రాత్రి వేళల్లో పెట్రోలింగ్ను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు. ఆస్తి నేరాలు, చోరీలు, గంజాయి అక్రమ రవాణా, ఇతర అసాంఘిక కార్యకలాపాలపై నిరంతర నిఘా కొనసాగిస్తూ, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని సూచించారు.

గ్రామాలను తరచూ సందర్శిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ పోలీసింగ్ను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రతి పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తూ ప్రజల విశ్వాసాన్ని మరింత పెంపొందించేలా సేవలు అందించాలని, విధులలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎస్పీ వెంట డీఎస్పీ నాగేంద్రచారి, సీఐ వెంకటేష్, ఎస్ఐ లక్ష్మణ్, సిబ్బంది ఉన్నారు.