పూర్వ ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేయాలి: కలెక్టర్ కోయ శ్రీహర్ష

నాణ్యమైన బోధనతో విద్యార్థుల నమోదు పెంచాలి
అంకితభావంతో పనిచేస్తే ప్రభుత్వ పాఠశాలలకు మరింత గుర్తింపు

పెద్దపల్లి, ఆంధ్రప్రభ: జిల్లాలో పూర్వ ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేసి చిన్నారులకు నాణ్యమైన విద్యా పునాదులు అందించేందుకు ప్రీ-ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్లు అంకితభావంతో పనిచేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రీ-ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్లకు నిర్వహించిన ఒకరోజు ఓరియంటేషన్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

జిల్లాలో గత విద్యా సంవత్సరం 63 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభించిన పూర్వ ప్రాథమిక విద్యను ఈ విద్యా సంవత్సరంలో మరో 48 పాఠశాలలకు విస్తరించడంతో ప్రస్తుతం 110 పాఠశాలల్లో అమలు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ప్రీ-ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్ల పట్టుదల, అంకితభావం, క్రమశిక్షణ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంపునకు దోహదపడతాయని అన్నారు. ఆటలు, పాటలు, కార్యాచరణ ఆధారిత బోధన ద్వారా చిన్నారుల్లో నేర్చుకునే ఆసక్తి పెరగడంతో పాటు ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల్లో విశ్వాసం కూడా పెరుగుతుందని పేర్కొన్నారు.

ప్రతి రోజు సమయపాలన పాటిస్తూ చిన్నారులకు ఆసక్తికరమైన విద్యా కార్యక్రమాలు నిర్వహించాలని, విద్యార్థుల నమోదు పెంపునకు అవసరమైన సహకారాన్ని జిల్లా యంత్రాంగం అందిస్తుందని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఓరియంటేషన్‌లో అందిస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకుని చిన్నారులకు బలమైన విద్యా పునాదులు వేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి శారద, జిల్లా అకాడమిక్ అధికారి షేక్, రిసోర్స్ పర్సన్స్, ప్రీ-ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్లు పాల్గొన్నారు.