ఏఐ కంపెనీలకు భారమైందా? పెరుగుతున్న నిర్వహణ వ్యయాలతో టెక్ దిగ్గజాలకు కొత్త సవాళ్లు
ఏఐ కంపెనీలకు భారమైందా? పెరుగుతున్న నిర్వహణ వ్యయాలతో టెక్ దిగ్గజాలకు కొత్త సవాళ్లు
- ఏఐపై భారీ పెట్టుబడులు.. పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు
- ఉబెర్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలకు ఆర్థిక ఒత్తిడి
- ఉద్యోగుల కంటే ఖరీదుగా మారుతున్న ఏఐ నిర్వహణ
- ఏఐ పెట్టుబడుల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాల కోత
సెంట్రల్ డెస్క్, ఆంధ్రప్రభ: ప్రపంచ టెక్నాలజీ రంగంలో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన, అదే సమయంలో ఆందోళన కలిగించే పరిస్థితి నెలకొంది.
ఖరీదుగా మారుతున్న కృత్రిమ మేధ
ఉద్యోగుల పనిని భర్తీ చేస్తుందని భావించిన కృత్రిమ మేధ సాధనాలపై కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టినప్పటికీ, ప్రస్తుతం వాటి నిర్వహణ వ్యయం ఉద్యోగుల వేతనాల కంటే ఎక్కువగా మారుతోంది. వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తూ, అదే డబ్బును ఏఐపై ఖర్చు చేస్తున్నప్పటికీ, ఆశించిన స్థాయిలో ఉత్పాదకత పెరగకపోవడంతో టెక్ రంగంలో కొత్త చర్చకు దారితీసింది.
పరిశ్రమ నిపుణులు ఈ పరిస్థితిని ఏఐ వ్యయ సంక్షోభంగా వర్ణిస్తున్నారు. టోకెన్ ఆధారిత ఏఐ వినియోగం, పెరుగుతున్న కంప్యూటింగ్ ఖర్చులు, భారీ పెట్టుబడులు, తగ్గని ఆపరేటింగ్ వ్యయాలు కలిసి అనేక సంస్థలను ఆర్థిక ఒత్తిడిలోకి నెట్టాయని వారు హెచ్చరిస్తున్నారు.
నాలుగు నెలల్లోనే వార్షిక బడ్జెట్ ఖాళీ
ప్రపంచ ప్రముఖ రైడ్ షేరింగ్ సంస్థ ఉబెర్ తాజాగా వెల్లడించిన వివరాలు ఈ పరిస్థితికి అద్దంపడుతున్నాయి. 2028 సంవత్సరానికి కంపెనీ కేటాయించిన ఏఐ కోడింగ్ బడ్జెట్‌ను కేవలం నాలుగు నెలల్లోనే పూర్తిగా వినియోగించింది. అయితే ఇంత భారీ వినియోగం జరిగినప్పటికీ, వినియోగదారులకు అందించిన కొత్త ఫీచర్లు లేదా ఉత్పాదకతలో అదే స్థాయిలో పెరుగుదల కనిపించలేదని ఉబెర్ అధ్యక్షుడు, సీఈఓ ఆండ్రూ మాక్‌డొనాల్డ్ స్వయంగా అంగీకరించారు.
మైక్రోసాఫ్ట్ సహా దిగ్గజ సంస్థలకూ పెరుగుతున్న భారం
ఏఐపై అత్యధికంగా పెట్టుబడులు పెట్టిన సంస్థల్లో ఒకటైన మైక్రోసాఫ్ట్ కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటోంది. ఇప్పటి వరకు ఈ సంస్థ ఓపెన్ఏఐలో సుమారు 13 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది. సంస్థ కోడ్‌లో దాదాపు 30 శాతం జనరేటివ్ ఏఐ ద్వారా రూపొందించినప్పటికీ, అధిక ఖర్చులు కారణంగా ఒక ప్రధాన ఏఐ కోడింగ్ టూల్‌ను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చినట్లు సమాచారం.
ఉద్యోగుల కంటే ఏఐ నిర్వహణ ఖరీదు
ఏఐ విప్లవానికి అవసరమైన చిప్‌లను తయారు చేస్తున్న ఎన్విడియా కూడా ఇదే విషయాన్ని అంగీకరించింది. సంస్థ అప్లయిడ్ డీప్ లెర్నింగ్ విభాగం వైస్ ప్రెసిడెంట్ బ్రయాన్ కటాంజారో ప్రకారం, తమ సంస్థలో ఉద్యోగులపై అయ్యే ఖర్చు కంటే ఏఐ కంప్యూటింగ్ ఖర్చు ఎక్కువగా ఉంది.
అయితే ఈ సంస్థ ప్రతి 5 లక్షల డాలర్ల విలువైన ఇంజనీర్ 2.5 లక్షల డాలర్ల విలువైన ఏఐ టోకెన్లు వినియోగించాలని సూచించడం పరిశ్రమలో చర్చనీయాంశమైంది.
40 బిలియన్ డాలర్ల పెట్టుబడులు
ప్రపంచంలోని ప్రధాన టెక్ కంపెనీలు 2026లో ఏఐ మౌలిక సదుపాయాల కోసం 740 బిలియన్ డాలర్ల మూలధన వ్యయాన్ని ప్రకటించాయి. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 69 శాతం అధికం.
మరోవైపు పరిశోధనా సంస్థ గార్డనర్ అంచనా ప్రకారం 2030లో ఏఐ ఏజెంట్ సాఫ్ట్‌వేర్‌పై ప్రపంచ వ్యయం 207 బిలియన్ డాలర్లకు చేరనుంది. ఇది గత ఏడాది కంటే 139 శాతం ఎక్కువ.
ఏఐ కోసం ఉద్యోగాల కోత
భారీ పెట్టుబడులతో పాటు ఉద్యోగ కోతలు కూడా కొనసాగుతున్నాయి. 2026లో ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 150కి పైగా టెక్ సంస్థలు కలిపి 1.15 లక్షల మందికి పైగా ఉద్యోగాలను తొలగించాయి. ఈ సంస్థలన్నీ కూడా ఉద్యోగుల తొలగింపునకు నిధులను ఏఐ డెవలప్మెంట్కు మళ్లించడమే ప్రధాన కారణంగా చెబుతున్నాయి.
