బీసీ హాస్టల్ తనిఖీ.. వార్డెన్‌పై అసంతృప్తి
మోత్కూర్, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని బీసీ బాలికల సంక్షేమ వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశాల మేరకు జిల్లా ఉపాధి కల్పన అధికారి, హాస్టల్ ప్రత్యేక అధికారి ఎన్. పద్మ గురువారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
తనిఖీ సందర్భంగా వసతి గృహ వార్డెన్ స్వప్న ఈసారి కూడా గైర్హాజరయ్యారని, గతంలో జూన్ 30న నిర్వహించిన తనిఖీలోనూ ఆమె విధులకు హాజరు కాలేదని గుర్తించి, విధుల నిర్వహణలో నిర్లక్ష్యంపై జిల్లా అధికారిణి అసంతృప్తి వ్యక్తం చేశారు.
హాస్టల్‌లో లైటింగ్ సరిగా లేకపోవడం, సానిటేషన్ సక్రమంగా లేకపోవడం, ఫ్యాన్లు పనిచేయకపోవడం, స్టాక్‌రూమ్‌కు తాళం వేయడం, రిజిస్టర్లు అందుబాటులో లేకపోవడం వంటి లోపాలను గుర్తించారు. ఈ అంశాలపై సమగ్ర నివేదికను జిల్లా కలెక్టర్‌కు అందజేస్తామని ఎన్. పద్మ తెలిపారు.
