గంజాయి స్మగ్లింగ్ గుట్టురట్టు
- రూ.56 లక్షల గంజాయి స్వాధీనం
- 113 కిలోల గంజాయితో నలుగురు అరెస్ట్
- మహారాష్ట్రకు తరలిస్తుండగా టూ టౌన్ పోలీసుల దాడి
- డిక్కీలు, డ్యాష్‌బోర్డుల్లో దాచి అక్రమ రవాణా
- ఇద్దరు నిందితులు పరారీ.. గాలింపు ముమ్మరం
- పోలీసు బృందాన్ని అభినందించిన సీపీ సునీల్ దత్
ఖమ్మం, ఆంధ్రప్రభ: నగర శివారులోని బైపాస్ రోడ్డుపై టూ టౌన్ పోలీసులు చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. విశ్వసనీయ సమాచారం అందడంతో టౌన్ ఏసీపీ రమణమూర్తి ఆదేశాల మేరకు బుధవారం అర్ధరాత్రి తిరుమల రోలింగ్ షట్టర్ ఇంజినీరింగ్ వర్క్స్ సమీపంలో నిఘా ఏర్పాటు చేశారు. ఖమ్మం టూ టౌన్ ఇన్‌స్పెక్టర్ బాలకృష్ణ, ఈగిల్ టీమ్ సీఐ విజయ్, ఎస్‌ఐ వి.రమేష్‌తో పాటు పోలీసు బృందం అనుమానాస్పదంగా వస్తున్న రెండు కార్లను అడ్డగట్టింది. తనిఖీల్లో వాహనాల డిక్కీలు, డ్యాష్‌బోర్డుల్లో రహస్యంగా దాచిన 53 ప్యాకెట్ల గంజాయి బయటపడింది. మొత్తం 113.025 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీని మార్కెట్ విలువ సుమారు రూ.56.50 లక్షలు ఉంటుందని వెల్లడించారు. ఘటనాస్థలంలోనే నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
అరెస్టయిన నిందితులు మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లాకు చెందిన రవి జాదవ్, గోపీనాథ్ సుక్లే, సంతోష్ థాయప్ప, మోహన్ భీకాజీ జాదవ్‌గా గుర్తించారు. వీరు ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి జిల్లా నుంచి తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. అద్దెకు తీసుకున్న మారుతి ఎర్టిగా, టాటా ఆరియా కార్లలో ప్రత్యేకంగా దాచిపెట్టి మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. గంజాయి సరఫరాదారుగా బసు అలియాస్ వాసు కీలక పాత్ర పోషించినట్లు గుర్తించారు. అద్దె వాహన యజమాని భావూసాహెబ్ యాదవ్ క్షీరసాగర్ కూడా కేసులో నిందితుడిగా ఉన్నట్లు పేర్కొన్నారు. వీరిద్దరూ ప్రస్తుతం పరారీలో ఉన్నారని వెల్లడించారు. వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు కొనసాగుతోందని ఇన్‌స్పెక్టర్ బాలకృష్ణ తెలిపారు.
గంజాయితో పాటు మారుతి ఎర్టిగా, టాటా ఆరియా కార్లు, నాలుగు మొబైల్ ఫోన్లు, రూ.850 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రాల మధ్య గంజాయి అక్రమ రవాణా ముఠాపై దర్యాప్తు మరింత విస్తరించినట్లు అధికారులు తెలిపారు. నిందితుల నెట్‌వర్క్, గతంలో చేసిన రవాణాలపై కూడా ఆరా తీస్తున్నారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు. ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించిన టూ టౌన్ పోలీసులు, ఈగిల్ టీమ్ సిబ్బందిని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ప్రత్యేకంగా అభినందించారు. పరారీలో ఉన్న ఇద్దరిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని అధికారులు ధీమా వ్యక్తం చేశారు. గంజాయి అక్రమ రవాణాకు పాల్పడే వారిపై నిర్దాక్షిణ్యంగా చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు.
