సుగాలి ప్రీతి కేసును రాజకీయం చేయొద్దు:
జనసేన నేత పెంటేల బాలాజీ
పవన్ కల్యాణ్ ఒత్తిడితోనే కేసు సీబీఐకి వెళ్లిందని వ్యాఖ్య.. రాజకీయ ఉచ్చులో పడొద్దని బాధిత కుటుంబానికి విజ్ఞప్తి
చిలకలూరిపేట, ఆంధ్రప్రభ: సుగాలి ప్రీతి మరణం అత్యంత దురదృష్టకరమని, ఆమె కుటుంబానికి న్యాయం జరగాలన్నదే జనసేన పార్టీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆకాంక్ష అని జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో-కన్వీనర్ పెంటేల బాలాజీ అన్నారు.
గురువారం తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రీతి తల్లి సుగాలి పార్వతీదేవి గన్నవరం పోలీస్ స్టేషన్‌లో పవన్ కల్యాణ్‌పై ఫిర్యాదు చేయడం వెనుక కొన్ని రాజకీయ శక్తుల ప్రమేయం ఉందనే అనుమానం వ్యక్తం చేశారు.
సుగాలి ప్రీతి కేసును గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో నీరుగార్చే ప్రయత్నం జరిగినప్పుడు, బాధిత కుటుంబానికి అండగా నిలిచి కర్నూలులో భారీ ర్యాలీ నిర్వహించిన నాయకుడు పవన్ కల్యాణ్ మాత్రమేనని అన్నారు. జనసేన ఒత్తిడి కారణంగానే అప్పటి ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఈ కేసు పూర్తిగా సీబీఐ పరిధిలో ఉందని, స్వతంత్ర దర్యాప్తు సంస్థ విచారణలో రాష్ట్ర ప్రభుత్వం గానీ, పవన్ కల్యాణ్ గానీ నేరుగా జోక్యం చేసుకోవడం చట్టపరంగా సాధ్యం కాదని చెప్పారు. గత ప్రభుత్వంలో కీలక ఆధారాలు ధ్వంసం కావడం వల్లే ప్రస్తుతం సాంకేతిక, డీఎన్‌ఏ ఆధారాల సేకరణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పవన్ కల్యాణ్ ప్రస్తావించారని, కేసు తీవ్రతను తగ్గించే ఉద్దేశం ఆయనకు లేదని స్పష్టం చేశారు.
నిందితులకు కోర్టులో శిక్ష పడాలంటే బలమైన ఆధారాలు అవసరమనే ఉద్దేశంతోనే పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేశారని బాలాజీ వివరించారు.
యూట్యూబర్ రావణ్ అరెస్టును సుగాలి ప్రీతి కేసుతో పోల్చడం సరికాదని అన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే, మహిళలపై అసభ్యకర పోస్టులు చేసే వారిని అరెస్టు చేయడం పోలీసుల బాధ్యత అని చెప్పారు. అలాంటి అంశాలను సీబీఐ దర్యాప్తులో ఉన్న పాత కేసులతో ముడిపెట్టి రాజకీయాలు చేయడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు.
పార్వతీదేవి బాధను తాము అర్థం చేసుకోగలమని పేర్కొన్న ఆయన, అధికారంలో ఉన్నప్పుడు కేసును అటకెక్కించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు పవన్ కల్యాణ్‌పై బురదజల్లేందుకు ఆమెను ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. పవన్ కల్యాణ్‌పై మోసం కేసు పెట్టాలని చెప్పడం హాస్యాస్పదమని, జనసేన నాయకులు ఆమెపై దాడులు చేస్తున్నారన్న ఆరోపణలు అవాస్తవమని అన్నారు.
కూటమి ప్రభుత్వం, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ కేసులో బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా, సీబీఐ దర్యాప్తు వేగవంతం అయ్యేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తారని తెలిపారు. రాజకీయ శక్తుల మాటలు నమ్మి తప్పుదోవ పట్టవద్దని సుగాలి పార్వతీదేవికి విజ్ఞప్తి చేశారు.
