గణపతి భక్తి వైభవానికి శ్రీకారం..
72 అడుగుల పంచముఖ వరసిద్ధి మహాగణపతి ఏర్పాట్లు..
సంప్రదాయం ప్రకారం భూమి పూజ
డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు
భారీ ఎకో ఫ్రెండ్లీ వినాయక విగ్రహ ఏర్పాటుకు నాంది..
భూమిపూజలో పాల్గొన్న విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని..
2026 మహాగణపతి నమూనా ఆవిష్కరణ
పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులే ఆదర్శం..
ఖైరతాబాద్ తరహా వైభవాన్ని విజయవాడలో కూడా
భక్తి, సంప్రదాయం, పర్యావరణ పరిరక్షణ కలబోసిన వినాయకోత్సవాలకు సిద్ధమవుతున్న నగరం..
భారీ ఎత్తున భక్తులను ఆకర్షించనున్న 72 అడుగుల మహాగణపతి విగ్రహం
విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని
భవానిపురం, ఆంధ్రప్రభ : వినాయక చవితి ఉత్సవాలకు విజయవాడలో భారీ వినాయకుడి ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. భవానీపురం సితార సెంటర్లో డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతిష్ఠించనున్న 72 అడుగుల పంచముఖ వరసిద్ధి మహాగణపతి భారీ ఎకో ఫ్రెండ్లీ విగ్రహ నిర్మాణానికి గురువారం శాస్త్రోక్తంగా భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని చిన్ని ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు ‘పంచముఖ వరసిద్ధి మహాగణపతి–2026’ నమూనాను ఆవిష్కరించారు.
పర్యావరణ పరిరక్షణతో పాటు భక్తి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలు విజయవాడకు ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ .. ఒకప్పుడు భారీ గణపతి విగ్రహాన్ని దర్శించాలంటే హైదరాబాద్ ఖైరతాబాద్కు వెళ్లాల్సి వచ్చేదని, అయితే గత ఆరు సంవత్సరాలుగా విజయవాడలోనే వైభవంగా మట్టి గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ నగరానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తున్నారని కొనియాడారు.
మట్టి వినాయక విగ్రహాల ప్రతిష్ఠ, పర్యావరణహిత నిమజ్జనంతో ఉత్సవాలను నిర్వహించడం సమాజానికి ఆదర్శమని పేర్కొన్న ఎంపీ, ప్రతి కుటుంబం తమ ఇళ్లలో మట్టి వినాయకుడినే ప్రతిష్ఠించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని పిలుపునిచ్చారు. భక్తి, సంస్కృతి, ప్రకృతి పరిరక్షణ ఒకే వేదికపై కలిసేలా ఈ ఉత్సవాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. 72 అడుగుల పంచముఖ వరసిద్ధి మహాగణపతి విగ్రహాన్ని విజయవాడలో ఏర్పాటు చేయడం నగర ప్రజలకు గర్వకారణమని ఎంపీ చిన్ని పేర్కొన్నారు. గత ఏడాది ముఖ్యమంత్రి కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొనడం ద్వారా ఈ కార్యక్రమాల నిర్వహణలో ఉన్న క్రమశిక్షణ, విశిష్టతకు గుర్తింపు లభించిందన్నారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా పర్యావరణహిత వినాయకోత్సవాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం.ఎస్. బేగ్, డూండి గణేష్ సేవా సమితి సభ్యులు ముక్తేశ్వరరావు, పేర్ల రవి, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
