నులిపురుగుల నిర్మూలనకు సిద్ధం
మరిపెడ, ఆంధ్రప్రభ: జూలై 13న నిర్వహించనున్న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని వంద శాతం విజయవంతం చేయాలని వైద్యాధికారి డాక్టర్ గుగులోతు రవి పిలుపునిచ్చారు. గురువారం మరిపెడ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా కార్యకర్తలతో సమావేశం నిర్వహించి అవగాహన కల్పించారు. మండలంలోని 1 నుంచి 19 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి బాలబాలికకు నులిపురుగుల నివారణ మాత్రలు అందించడమే లక్ష్యమని తెలిపారు.
కడుపులో నులిపురుగులు ఉండడం వల్ల పిల్లలు రక్తహీనత, పోషకాహార లోపంతో పాటు శారీరక, మానసిక ఎదుగుదలలో వెనుకబడే ప్రమాదం ఉందని వివరించారు. తొలి విడతగా జూలై 13న, రెండో విడతగా జూలై 20న అంగన్వాడీ కేంద్రాల ద్వారా మాత్రలు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. జూలై 13, 20 తేదీల్లో ప్రతి ఇంటిని సందర్శించి అర్హులైన పిల్లలందరికీ మాత్రలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆశా కార్యకర్తలను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ స్వామి, డాక్టర్ కిరణ్ సాగర్, పబ్లిక్ హెల్త్ నర్సింగ్ ఆఫీసర్ మంగమ్మ, హెల్త్ సూపర్వైజర్లు ఆచార్యులు, లక్ష్మీకుమారి, మాధవి, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
