150 పడకల ఆసుపత్రిని సందర్శించిన మంత్రి
మక్తల్ , ఆంధ్రప్రభ : నారాయణ పేట జిల్లా మక్తల్ పట్టణంలో కొనసాగుతున్న 150 పడకల ఆస్పత్రి నిర్మాణ పనులను రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి పరిశీలించారు. ఇక్కడ జరుగుతున్న పనులు ఇంకా చేపట్టాల్సిన పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిరుపేద ప్రజల సంక్షేమం కోసం ఏర్పడుతున్న ఈ ఆసుపత్రి నిర్మాణం పనులు మరింత వేగవంతంగా చెప్పటాల్సిందిగా ఆయన సూచించారు.
పనుల్లో నాణ్యత విషయంలో రాజీ పడేది లేదన్నారు. నాణ్యతగా పనులను పూర్తి చేయాలని మంత్రి ఈ సందర్భంగా అధికారులు కాంట్రాక్టర్ ను ఆదేశించారు. మక్తల్ పట్టణంలో నిర్మించనున్న 150 పడకల ఆస్పత్రి పనులను నవంబర్ లోగ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.167వ జాతీయ రహదారి నుంచి ఆసుపత్రికి వచ్చే రహదారి సంబంధించిన స్థలాన్ని కూడా మంత్రి శ్రీహరి పరిశీలించారు.
ఆస్పత్రికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా విశాలమైన రోడ్డు ఉండాలని అధికారులకు సూచించారు. ఆసుపత్రి నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంత ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం స్థానికంగానే అందుతుందన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్థానికంగానే అన్ని రకాల వైద్య సేవలు అందించడం లక్ష్యంగా 150 పడకల ఆసుపత్రి నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు.
ఆస్పత్రి నిర్మాణ పనులు దాదాపుగా చివరి దశకు చేరుకున్నాయని మిగతా పనులన్నీ కూడా వేగవంతం చేయాలని ఆయన సూచించారు. జాతీయ రహదారికి అతి చెరువులో ఉండడం వల్ల ప్రజలకు రవాణా సౌకర్యం ఇబ్బందులు లేకుండా విశాలమైన రోడ్డు ఏర్పాటు చేస్తామన్నారు. అదేవిధంగా మక్తల్ అనుగొండ రోడ్డు నుండి కూడా ఆసుపత్రికి రోడ్డు మార్గం కల్పిస్తామని చెప్పారు.
నలుదిక్కుల నుండి రోడ్డు సదుపాయం కల్పించడం కోసం కృషి చేస్తామన్నారు. నవంబర్ నాటికి నిర్మాణ పనులను పూర్తిచేస్తే డిసెంబర్లో ఆసుపత్రిని ప్రారంభించాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.ఆసుపత్రి నిర్మాణ పనుల్లో మరింత వేగం పెంచాలని మంత్రి సూచించారు. మంత్రి శ్రీహరి వెంబడి కాంగ్రెస్ నాయకులు కట్టా సురేష్ కుమార్ గుప్తా, బోయ రవికుమార్, వాకిటి హన్మంతు, కావాలి తాయప్ప, ఫయాజ్ తదితరులు ఉన్నారు.
