17 పంచాయతీలకు బస్సు లేదు..

పదో తరగతితోనే ఆగుతున్న బాలికల చదువు

రోడ్లు ఉన్నా ఆర్టీసీ సేవలు లేవు..

గ్రామీణ విద్యార్థినుల ఉన్నత విద్యకు రవాణా అడ్డంకి

లావేరు, శ్రీకాకుళం, ఆంధ్రప్రభ: లావేరు మండలంలోని 17 పంచాయతీలకు ఇప్పటికీ ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాల బాలికల ఉన్నత విద్యకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. పదో తరగతి వరకు గ్రామాల్లోనే చదువుతున్న విద్యార్థినులు ఇంటర్, డిగ్రీ చదవాలంటే శ్రీకాకుళం లేదా రణస్థలం వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. రవాణా సౌకర్యం లేక చాలామంది తల్లిదండ్రులు కుమార్తెలను పదో తరగతి తర్వాత చదివించకుండా ఇంటి వద్దే ఉంచి, 18 ఏళ్లు నిండిన తర్వాత వివాహం చేస్తున్నారు.

లావేరు మండలంలో వెంకటాపురం, లావేరు, సుభద్రాపురం, బొంతుపేట, బెజ్జిపురం జంక్షన్, అదపాక జంక్షన్, బుడుమూరు పంచాయతీలకు మాత్రమే ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది. మిగిలిన 17 పంచాయతీలకు బస్సులు నడవడం లేదు.

గతంలో శ్రీకాకుళం నుంచి అదపాక మీదుగా గుర్రాలపాలెం వరకు, మరోవైపు తామాడ మీదుగా లక్ష్మీపురం వరకు ఆర్టీసీ బస్సులు నడిచేవి. అప్పట్లో సరైన రహదారులు లేకపోయినా సేవలు అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం తారు రోడ్లు ఉన్నప్పటికీ బస్సు సర్వీసులు పునరుద్ధరించలేదు.

మండల సర్వసభ్య సమావేశాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు పలుమార్లు బస్సు సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఆటోల వినియోగం ఎక్కువగా ఉండటం, బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య తగ్గిపోవడం వల్ల సంస్థకు నష్టం వస్తోందని అధికారులు గతంలో పేర్కొన్నట్లు స్థానికులు చెబుతున్నారు.

కొత్తకోట, గుర్రాలపాలెం, చిన్నకొత్తకోట, పెద్దకొత్తకోట గ్రామాల విద్యార్థినులు అదపాక జంక్షన్‌కు చేరుకుని అక్కడి నుంచి శ్రీకాకుళం లేదా రణస్థలం వెళ్లాల్సి వస్తోంది. అలాగే లక్ష్మీపురం, నేతేరు, నేదురుపేట, పట్నవానిపేట, గొర్లిపేట, చిత్రికిపేట, తామాడ, రౌతుపేట గ్రామాల విద్యార్థినులు బుడుమూరు జంక్షన్‌కు చేరుకుని కాలేజీలకు వెళ్లాల్సి వస్తోంది.

ఆర్థికంగా బలమైన కుటుంబాలు తమ కుమార్తెలను శ్రీకాకుళం, విశాఖపట్నంలోని వసతి గృహాల్లో ఉంచి చదివిస్తున్నా, మధ్యతరగతి, పేద కుటుంబాలకు అది సాధ్యం కావడం లేదు. చదవాలనే ఆసక్తి ఉన్నప్పటికీ రవాణా, ఆర్థిక ఇబ్బందుల కారణంగా పలువురు విద్యార్థినులు చదువును మధ్యలోనే నిలిపివేస్తున్నారు.

ప్రస్తుతం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఆధార్ కార్డు ఆధారంగా ఉచిత ప్రయాణ సౌకర్యం అమలులో ఉంది. బస్సు సౌకర్యం ఉన్న ప్రాంతాల విద్యార్థినులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఉన్నత విద్య అభ్యసిస్తున్నారు. లావేరు మండలంలోని మిగిలిన గ్రామాలకు కూడా ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తే గ్రామీణ ప్రాంతాల బాలికలు ఉన్నత విద్య కొనసాగించే అవకాశం పెరుగుతుందని తల్లిదండ్రులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.