చౌకధరల దుకాణాన్ని పరిశీలించిన సర్పంచ్

వాంకిడి (ఆంధ్రప్రభ): మండలంలోని బంబార గ్రామపంచాయతీ పరిధిలోని చౌకధర దుకాణాన్ని గురువారం సర్పంచ్ బెండారే కృష్ణాజి సందర్శించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్న బియ్యం నాణ్యతను పరిశీలించి, పంపిణీ ప్రక్రియపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న బియ్యాన్ని ప్రతి అర్హులైన లబ్ధిదారుడు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు ప్రతి కుటుంబానికి చేరేలా అధికారులు, డీలర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.

బియ్యం పంపిణీలో పూర్తి పారదర్శకత పాటిస్తూ ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా చూడాలని, ప్రభుత్వం నిర్దేశించిన మేరకు ప్రతి అర్హుడికి బియ్యం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, చౌకధర దుకాణం డీలర్, గ్రామస్థులు పాల్గొన్నారు.