ప్రత్యేక ఓటరు జాబితా సవరణలో భాగస్వాములు కావాలి..
భీమ్‌గల్ రూరల్ (ఆంధ్రప్రభ): ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో ప్రతి అర్హత కలిగిన ఓటరు పాల్గొని ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని బీజేపీ భీమ్‌గల్ మండల అధ్యక్షుడు అరె రవీందర్ పిలుపునిచ్చారు. గురువారం మండలంలోని మెండోరా గ్రామంలో ఆయన, మాజీ ఎంపీటీసీ సభ్యురాలు అరె లావణ్య దంపతులు తమ ఓటరు గణన పత్రాలను పూర్తి చేసి సంబంధిత బూత్ లెవల్ అధికారి (బీఎల్‌వో) దీప్సన్‌కు అందజేశారు.
ఈ సందర్భంగా అరె రవీందర్ మాట్లాడుతూ.. ఓటరు జాబితా సక్రమంగా రూపొందడం ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎంతో కీలకమని అన్నారు. ఎన్నికల సంఘం సూచించిన విధంగా ప్రతి అర్హత కలిగిన ఓటరు గణన పత్రాలను పూర్తిచేసి అవసరమైన ధ్రువపత్రాలతో కలిసి సంబంధిత బీఎల్‌వోలకు సమర్పించాలని కోరారు.
అపోహలు, అసత్య ప్రచారాలను నమ్మకుండా ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరించాలని సూచించారు. ఓటు హక్కును పరిరక్షించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని, ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ ఈ ప్రక్రియలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
