ట్రినిటీ హైస్కూల్‌లో విద్యార్థి నాయకుల ఎన్నికలు

చౌటుప్పల్ (ఆంధ్రప్రభ): చౌటుప్పల్ పట్టణంలోని ట్రినిటీ హైస్కూల్‌లో హెడ్ బాయ్, హెడ్ గర్ల్ ఎన్నికలు గురువారం ఉత్సాహభరితంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించారు. సాధారణ ఎన్నికల తరహాలో విద్యార్థులందరూ క్రమశిక్షణతో తమ ఓటు హక్కును వినియోగించుకుని విద్యార్థి నాయకులను ఎన్నుకున్నారు.

ఎన్నికల ఫలితాల్లో మెయిన్ క్యాంపస్ హెడ్ బాయ్‌గా బి. పవన్ కుమార్, హెడ్ గర్ల్‌గా సిహెచ్. మనస్విని ఎన్నికయ్యారు. అలాగే ఐఐటీ క్యాంపస్ హెడ్ బాయ్‌గా ఎన్. సాయి నిఖిల్, హెడ్ గర్ల్‌గా జి. హర్షిత విజయం సాధించారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ కెవీబీ కృష్ణారావు, ప్రిన్సిపాల్ కమ్ డైరెక్టర్ డాక్టర్ ఉజ్జిని మంజుల నూతన విద్యార్థి నాయకులతో ప్రమాణ స్వీకారం చేయించి, వారికి బ్యాడ్జీలు అలంకరించి అభినందించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు.