వరి ధాన్యం, మక్కలను త్వరితగతిన మిల్లులకు తరలించాలి

వరి ధాన్యం, మక్కలను త్వరితగతిన మిల్లులకు తరలించాలి
-జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
చిట్యాల, ఆంధ్రప్రభ: రైతులు పండించిన వరి, మొక్కజొన్న ధాన్యాన్ని సేకరించి, ఏమాత్రం జాప్యం చేయకుండా మిల్లులకు తరలించాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన చిట్యాల మండలంలోని దూత్‌పల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, కొనుగోలు ప్రక్రియను స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. రవాణాలో జాప్యం వద్దని, తేమ శాతం సరిగ్గా ఉన్న ధాన్యాన్ని వెంటనే మిల్లులకు పంపాలని సూచించారు. కేవలం లారీల కోసమే వేచి చూడకుండా, తక్కువ పరిమాణంలో ఉన్న ధాన్యాన్ని ట్రాక్టర్ల ద్వారా మ్యాపింగ్ చేసిన మిల్లులకు తరలించాలన్నారు. అకాల వర్షాల నేపథ్యంలో కల్లాల వద్ద సరిపడా గన్ని సంచులు, టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలన్నారు.
నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
మండల శివారులోని బాల మురుగన్ పత్తి మిల్లులో నిల్వ చేసిన మక్కలను, వే బ్రిడ్జిని కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ క్రమంలో OPMS (Online Procurement Management System) లో వివరాలు నమోదు కావడం లేదని రైతులు ఫిర్యాదు చేయగా, కలెక్టర్ స్పందిస్తూ వ్యవసాయ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
“క్రాప్ బుకింగ్ సక్రమంగా జరగకపోతే రైతులు తీవ్ర ఇబ్బందులు పడతారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రతి రైతు పంట వివరాలను పకడ్బందీగా నమోదు చేయాలి,” అని అధికారులను హెచ్చరించారు.
రైతులకు ప్రోత్సాహకాలు
రైతులు తమ సొంత ఖర్చులతో మొక్కజొన్నలను గోదాములకు తరలిస్తే, వారికి ప్రభుత్వం తరపున రవాణా ఖర్చులు, గన్ని సంచుల ఖర్చు తిరిగి చెల్లిస్తామని కలెక్టర్ వెల్లడించారు. మార్క్-ఫెడ్ అధికారులు నిత్యం అందుబాటులో ఉండి, ప్రతి గింజనూ మిల్లులకు చేర్చే వరకు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు.
