‘భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి’తో సిటీ పోలీస్ సమావేశం…

  • వినాయక విగ్రహాల ఎత్తు 15 అడుగులు మించొద్దు..
  • గణేష్ ఉత్సవ నిర్వాహకులకు మార్గదర్శకాలు…

ఆంధ్ర‌ప్ర‌భ, హైదరాబాద్ : రాబోయే వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని భక్తుల రక్షణ, భద్రతే ధ్యేయంగా హైదరాబాద్ సిటీ పోలీస్ విభాగం ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నేడు ‘భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి’ ప్రతినిధులతో పోలీస్ ఉన్నతాధికారులు ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

గతంలో ఊరేగింపుల సమయంలో విద్యుత్ తీగలు తగిలి జరిగిన ప్రమాదాలను, ప్రాణనష్టాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈసారి విగ్రహాల తయారీ దశ నుంచే నిర్వాహకులు, కళాకారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు స్పష్టం చేశారు. నగరంలో సాధారణంగా విద్యుత్ లైన్ల తీగలు 22 అడుగుల ఎత్తులో ఉంటాయని, విగ్రహాలను తరలించే ట్రాలీల ఎత్తు సుమారు 4 అడుగుల వరకు ఉంటుందని అధికారులు ఈ సందర్భంగా గుర్తుచేశారు.

ఈ సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకుని, నిమజ్జన ఊరేగింపులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలంటే వినాయక విగ్రహాల ఎత్తును 15 అడుగుల లోపు మాత్రమే పరిమితం చేయాలని సూచించారు. ఈ విషయంలో ఉత్సవ సమితి ప్రతినిధులు చొరవ తీసుకుని విగ్రహాల తయారీదారులతో (కళాకారులతో) మాట్లాడి, నిబంధనలు పాటించేలా చూడాలని కోరారు.

ముఖ్యంగా శోభాయాత్ర సమయంలో రోడ్లపై తక్కువ ఎత్తులో వేలాడే విద్యుత్ తీగలను భక్తులు లేదా నిర్వాహకులు కర్రలతో, ప్లాస్టిక్ పైపులతో పైకి లేపే ప్రయత్నం చేస్తుంటారని, ఇది అత్యంత ప్రమాదకరమని పోలీసులు హెచ్చరించారు. ఇలాంటి సాహసాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని, నిబంధనల ప్రకారం వ్యవహరించాలని స్పష్టం చేశారు.

ప్రజల ప్రాణరక్షణే తమకు అత్యంత ముఖ్యమని పేర్కొన్న నగర పోలీస్ విభాగం.. పండుగను ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో భక్తిశ్రద్ధలతో విజయవంతం చేసేందుకు భక్తులకు, నిర్వాహకులకు అన్ని వేళలా పూర్తి స్థాయిలో సహకరిస్తుందని భరోసా ఇచ్చింది.