ఎన్నికల విధుల్లో అలసత్వం సహించం: కలెక్టర్ డాక్టర్ ఎ. సిరి

ఆరుగురు బీఎల్‌వోలు, అధికారులపై క్రమశిక్షణ చర్యలు.. ఉత్తర్వులు జారీ

కర్నూలు ప్రతినిధి, ఆంధ్రప్రభ: ఎన్నికల ప్రక్రియలో నిర్లక్ష్యానికి ఏమాత్రం తావులేదని స్పష్టం చేస్తూ జిల్లా ఎన్నికల అధికారి, కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. సిరి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటించకుండా విధుల్లో అలసత్వం ప్రదర్శించిన ఆరుగురు బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌వోలు), ఎన్నికల సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు చేపడుతూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ఇంటింటి సర్వే, ఓటర్ల వివరాల ధృవీకరణ, ఫారాల స్వీకరణ, నమోదు ప్రక్రియలను కచ్చితంగా నిర్వహించాల్సిన బాధ్యత బీఎల్‌వోలపై ఉంటుంది. అయితే విధులను సక్రమంగా నిర్వర్తించకపోవడం, నిర్దేశించిన ప్రమాణాలను పాటించకపోవడం, ఎన్నికల ప్రక్రియకు భంగం కలిగించేలా వ్యవహరించినట్లు గుర్తించడంతో సంబంధిత అధికారులపై చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

చర్యలకు గురైన వారిలో 146-ఆదోని అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఈడీటీ గాయత్రి, కపాటి గ్రామ పంచాయతీ ఇంజినీరింగ్ అసిస్టెంట్, పోలింగ్ స్టేషన్-63 బీఎల్‌వో బెస్త వీరేష్, 143-కొడుమూరు నియోజకవర్గంలోని పోలకల్ గ్రామ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, పోలింగ్ స్టేషన్-144 బీఎల్‌వో కురువ సాంబశివుడు, 144-ఆలూరు నియోజకవర్గంలోని గుల్యం గ్రామ వ్యవసాయ సహాయకురాలు, పోలింగ్ స్టేషన్-19 బీఎల్‌వో కుమారి మేకల వైష్ణవి, 138-పాణ్యం నియోజకవర్గానికి చెందిన వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ వార్డ్ ప్రాసెసింగ్ సెక్రటరీ, పోలింగ్ స్టేషన్-105 బీఎల్‌వో రవీంద్రుడు గండికోట, వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ సెక్రటరీ, పోలింగ్ స్టేషన్-112 బీఎల్‌వో శ్రీలత ఎనుగుల ఉన్నారు.

ఎన్నికల విధులు అత్యంత బాధ్యతాయుతమైనవని, ఓటర్ల జాబితా ఖచ్చితత్వంపైనే ప్రజాస్వామ్య వ్యవస్థ ఆధారపడి ఉంటుందని కలెక్టర్ డాక్టర్ ఎ. సిరి పేర్కొన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాలను విస్మరించడం, విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించడం, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం వంటి చర్యలను ఏమాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా ఎన్నికల విధుల్లో అలసత్వం ప్రదర్శించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఈ చర్యలతో జిల్లాలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న బీఎల్‌వోలు, ఇతర ఎన్నికల సిబ్బందికి స్పష్టమైన హెచ్చరిక వెళ్లినట్లయిందని అధికారులు తెలిపారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన పర్యవేక్షణ కొనసాగిస్తోందని వెల్లడించారు.