స్కూల్ బస్సును ఢీకొన్న లారీ..!
- విద్యార్థులకు స్వల్ప గాయాలు
కురవి, ఆంధ్రప్రభ: మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని నల్లెల్ల స్టేజి వద్ద బుధవారం స్కూల్ బస్సు లారీని ఢీకొన్న ఘటన కలకలం రేపింది. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులకు స్వల్ప గాయాలు కాగా, వారిని వెంటనే మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
స్థానికుల కథనం ప్రకారం.. కురవి మండల కేంద్రానికి చెందిన నాగార్జున ప్రైవేట్ స్కూల్ బస్సు అతివేగంగా వెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారీని ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 40 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. వీరిలో ఎక్కువ మంది లింగ్యతండా గ్రామానికి చెందిన వారిగా తెలుస్తోంది.
సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన విద్యార్థులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనలో గాయపడిన విద్యార్థుల సంఖ్య, వారి ఆరోగ్య పరిస్థితిపై అధికారిక వివరాలు వెల్లడికావాల్సి ఉంది.
ఇదిలా ఉండగా, స్కూల్ బస్సును అనుభవం, తగిన అర్హతలు లేని డ్రైవర్ నడిపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యార్థుల భద్రతను విస్మరించి అధిక వేగంతో బస్సు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. స్కూల్ యాజమాన్యంపై సమగ్ర విచారణ జరిపి, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
