బాపట్లలో వైఎస్సార్ జయంతి వేడుకలు

వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన మాడా సుబ్రహ్మణ్యం
మహానేత ఆశయాలను కొనసాగించాలని పిలుపు

బాపట్ల రూరల్, ఆంధ్రప్రభ: మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా బాపట్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నివాళి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. టీచర్స్ కాలనీ, హైదర్‌పేట, కర్లపాలెం, పిట్లవాణిపాలెం సమీపంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు మాజీ సర్పంచి, సీనియర్ వైసీపీ నాయకుడు మాడా సుబ్రహ్మణ్యం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మాడా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మాట తప్పని, మడమ తిప్పని నాయకత్వానికి ప్రతీక డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని కొనియాడారు. పేదల సంక్షేమం, రైతుల అభ్యున్నతి కోసం ఆయన ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ పథకాలు చిరస్థాయిగా నిలిచిపోయాయని, ప్రజల గుండెల్లో చిరస్మరణీయ నాయకుడిగా నిలిచారని పేర్కొన్నారు.

వైఎస్సార్ 77వ జయంతి సందర్భంగా మహానేతకు ఘన నివాళులు అర్పిస్తున్నామని, ఆయన ఆశయాలను కొనసాగించడం ప్రతి కార్యకర్త బాధ్యత అని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆట్ల నాగిరెడ్డి, గరుగంటి కిరణ్, షేక్ సంజీవ్, ఇమ్రాన్, కేశవరెడ్డి, మందపాటి పాపారావు, మనోహర్, పిన్నిబోయిన నాగరాజు, షేక్ షరీఫ్ తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.