పరీక్షలో కాపీ పట్టుకున్న ప్రిన్సిపాల్‌పై విద్యార్థి దాడి..

-నల్ల బ్యాడ్జీలతో అధ్యాపకుల నిరసన

భైంసా, ఆంధ్రప్రభ: భైంసాలోని గోపాల్‌రావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరీక్షల సందర్భంగా ప్రిన్సిపాల్‌పై విద్యార్థి దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనను ఖండిస్తూ బుధవారం కళాశాల అధ్యాపకులు, సీపీడీసీ సభ్యులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు.

జూలై 7న సాయంత్రం సుమారు 4:45 గంటలకు కళాశాల ప్రిన్సిపాల్ కర్రోళ్ల బుచ్చయ్య పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేస్తుండగా ఓ విద్యార్థి కాపీ కొడుతున్నట్లు గుర్తించారు. దీంతో అతని ఆన్సర్ బుక్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ఆగ్రహించిన విద్యార్థి ప్రిన్సిపాల్ చేతుల నుంచి ఆన్సర్ బుక్‌ను బలవంతంగా లాక్కొని చించి వేసి, అనంతరం ఆయనపై భౌతిక దాడికి పాల్పడ్డాడు.

ఘటనను అడ్డుకునేందుకు అక్కడ విధులు నిర్వహిస్తున్న ఇన్విజిలేటర్లు, కళాశాల సిబ్బంది ప్రయత్నించగా వారిని కూడా తోసివేసి, సమీపంలోని గోడపై నుంచి దూకి విద్యార్థి పరారయ్యాడు. ఈ ఘటనపై కళాశాల అధ్యాపకులు, సీపీడీసీ అధ్యక్షుడు డాక్టర్ నాగేష్, ప్రధాన కార్యదర్శి మనోజ్ ఆధ్వర్యంలో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను స్వీకరించిన పోలీసులు నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఘటనను నిరసిస్తూ బుధవారం ప్రిన్సిపాల్ కర్రోళ్ల బుచ్చయ్య ఆధ్వర్యంలో అధ్యాపకులు, సీపీడీసీ సభ్యులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధులు నిర్వహిస్తున్న అధికారులపై ఇలాంటి దాడులు ప్రజాస్వామ్యానికి, విద్యా వ్యవస్థకు ముప్పుగా మారుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ అధికారులు, విద్యాసంస్థల సిబ్బంది విధులు నిర్విఘ్నంగా నిర్వహించేలా ప్రభుత్వం, పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకుని ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని వారు విజ్ఞప్తి చేశారు.