new trend | అద్దెకు అమ్మాయిలు, అబ్బాయిలు

new trend | అద్దెకు అమ్మాయిలు, అబ్బాయిలు

రెంట్ మీ ఫర్ ఎ డే’..
యువతలో కొత్త ట్రెండ్‌గా మారుతున్న అద్దె స్నేహం
కాఫీ డేట్ నుంచి వీకెండ్ ట్రిప్ వరకు గంటలు, రోజుల వారీగా ఛార్జీలు
ఒంటరితనం, సామాజిక ఒత్తిళ్లతో పెరుగుతున్న ‘రెంట్ ఎ ఫ్రెండ్’ సేవలు
భద్రత, గోప్యత, చట్టపరమైన అంశాలపై నిపుణుల హెచ్చరిక

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : నగర జీవితంలో ఒంటరితనం, సామాజిక ఒత్తిళ్లు పెరుగుతున్న నేపథ్యంలో ‘రెంట్ మీ ఫర్ ఎ డే’ లేదా ‘రెంట్ ఎ ఫ్రెండ్’ సేవలు యువతలో కొత్త చర్చకు దారితీస్తున్నాయి. కాఫీ డేట్, డిన్నర్, కుటుంబ వేడుకలు, ఈవెంట్లకు తోడుగా రావడం వంటి సేవలను నిర్ణీత రుసుముతో అందించే ఈ విధానం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది.

ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న పోస్టుల ప్రకారం, కొంతమంది యువతులు, యువకులు గంటలు లేదా రోజుల ప్రాతిపదికన తమ సమయాన్ని అందుబాటులో ఉంచుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాఫీ డేట్, డిన్నర్, సినిమా, కుటుంబ సమావేశాలు, స్నేహితుల ఈవెంట్లు, బైక్ రైడ్, వీకెండ్ ట్రిప్ వంటి కార్యక్రమాలకు తోడుగా రావడానికి వేర్వేరు రుసుములు నిర్ణయిస్తున్నట్లు పోస్టుల్లో కనిపిస్తోంది.

ఈ సేవలను అందించే వారు వీటిని ప్రేమ లేదా వివాహ సంబంధాలుగా కాకుండా, కేవలం సామాజిక సహవాసం (Social Companion Service)గా పేర్కొంటున్నారు. ఒంటరిగా కార్యక్రమాలకు వెళ్లడానికి ఇబ్బంది పడేవారు, కొత్త నగరాల్లో నివసించే వారు, లేదా స్నేహితుల సహవాసం కోరుకునే వారి కోసం ఈ తరహా సేవలు అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు.

అయితే ఈ సేవలపై నిపుణులు జాగ్రత్తలు సూచిస్తున్నారు. వ్యక్తిగత భద్రత, గోప్యత, ఆర్థిక మోసాలు, నకిలీ ప్రొఫైళ్లు, చట్టపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సేవలను వినియోగించే ముందు సంబంధిత సంస్థ లేదా వ్యక్తి విశ్వసనీయతను నిర్ధారించుకోవాలని సూచిస్తున్నారు.