రైతుల పాలిట ఆపద్బాంధవుడు వైఎస్సార్

మక్తల్, ఆంధ్రప్రభ: దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి రైతుల పాలిట ఆపద్బాంధవుడని కాంగ్రెస్ నాయకులు కొనియాడారు. ఆయన 77వ జయంతి సందర్భంగా బుధవారం మక్తల్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజా సేవలు, రైతు సంక్షేమానికి చేసిన కృషిని స్మరించుకున్నారు.

నాయకులు మాట్లాడుతూ, చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన వైఎస్సార్ ఆరుసార్లు ఎమ్మెల్యేగా, నాలుగు సార్లు ఎంపీగా ప్రజల ఆదరణ పొందారని తెలిపారు. ఆయన చేపట్టిన పాదయాత్ర చారిత్రాత్మకమైందని, అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఉచిత విద్యుత్, జలయజ్ఞం ద్వారా అనేక సాగునీటి ప్రాజెక్టులను నిర్మించి వ్యవసాయ రంగానికి కొత్త ఊపు తీసుకువచ్చారని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి సంక్షేమ పథకాలతో పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపారని అన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ వాకిటి మానస హన్మంతు, మాజీ జడ్పీటీసీ జి. లక్ష్మారెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ బి. గణేష్ కుమార్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అల్కూరి రవికుమార్, నాయకులు బి. శంషొద్దీన్, కె. నాగిరెడ్డి, నీలా గౌడ్, గోవర్ధన్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.