గుడిసెలు లేని గ్రామాలే ప్రభుత్వ లక్ష్యం: చంద్రకాంత్ రెడ్డి
బిక్కనూర్ (ఆంధ్రప్రభ): గుడిసెలు లేని గ్రామాలే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి అన్నారు. బుధవారం బిక్కనూర్ మండలం తిప్పాపూర్ గ్రామంలో గుడిసెల్లో నివసిస్తున్న 13 మంది లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల పత్రాలను ఆయన పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా చంద్రకాంత్ రెడ్డి మాట్లాడుతూ, లబ్ధిదారులు సకాలంలో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాలని సూచించారు. ప్రతి పేద కుటుంబం సొంతింటి కలను నెరవేర్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గత ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని విస్మరించిందని ఆరోపిస్తూ, ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
రెండో విడతలో గుడిసెల్లో నివసిస్తున్న అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి రాజ్‌కిరణ్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ కుంట లింగారెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీరామ్ వెంకటేష్, మండల మాజీ అధ్యక్షుడు భీమ్ రెడ్డి, గ్రామ సచివాలయ వార్డు సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.
