Pawan 17th | నిరంజన్ మృతిపై పవన్ కల్యాణ్ ఆవేదన

Pawan 17th | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : హనుమకొండకు చెందిన తన అభిమాని నిరంజన్ మృతిపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన, “నిరంజన్ ఇక లేడనే వార్త నా హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది” అంటూ భావోద్వేగానికి గురయ్యారు.

ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న నిరంజన్‌ను గత నెల 17న పవన్ కల్యాణ్ స్వయంగా హనుమకొండలోని అతని నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆ సందర్భంగా చిన్నారితో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ, అతని మరణం తీవ్ర వేదన కలిగించిందని తెలిపారు.

నిరంజన్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని పవన్ పేర్కొన్నారు. ఈ తీరని విషాదాన్ని భరించే ధైర్యాన్ని ఆ కుటుంబానికి దేవుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు.

ప్రాణాంతక వ్యాధితో చికిత్స పొందుతున్న నిరంజన్ మంగళవారం అర్ధరాత్రి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచాడు. ఆయన మృతితో కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయారు.