సంక్షేమ పథకాలకు నాంది పలికిన మహానేత వైఎస్సార్

వరంగల్ ప్రతినిధి (ఆంధ్రప్రభ): దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి వేడుకలను వరంగల్ జిల్లా నర్సంపేటలోని వైఎస్సార్ స్మారక గార్డెన్‌లో రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ మాజీ డైరెక్టర్ నాడెం శాంతికుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా నాడెం శాంతికుమార్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రిగా వైఎస్సార్ రైతులకు ఉచిత విద్యుత్, పేదలకు ఆరోగ్యశ్రీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి చారిత్రాత్మక సంక్షేమ పథకాలను అమలు చేసి లక్షలాది కుటుంబాలకు అండగా నిలిచారని అన్నారు. రైతులు, పేదలు, విద్యార్థుల అభ్యున్నతి కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. వైఎస్సార్ ప్రజాసేవా స్ఫూర్తి తనకు ఎప్పటికీ ఆదర్శమని, ఆయన భౌతికంగా లేకపోయినా సంక్షేమ కార్యక్రమాలు, జ్ఞాపకాలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు.

కార్యక్రమంలో నాడెం నాగేశ్వర్, జిల్లా పెళ్లి దినేష్, కోక్కర్‌కొండ కట్టయ్య, ఎస్‌కే కాజా బి, సల్ల కర్ణాకర్, గాండ్ల రాజు, ఎస్‌కే జాఫర్, రాజు, హమాలీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.