ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కుటుంబాలకు తొలి ప్రాధాన్యత

బెజ్జంకి (ఆంధ్రప్రభ): మండలంలోని వీరాపూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కుటుంబాలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో తొలి ప్రాధాన్యత కల్పించాలని గ్రామ పంచాయతీ నిర్ణయించింది. ఈ విషయాన్ని గ్రామ సర్పంచ్ చిలముల సతీష్ వెల్లడించారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రత్యేక గుర్తింపు కల్పించేందుకు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ప్రత్యేక గుర్తింపు కార్డులను జారీ చేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లల కుటుంబాలకు విద్య, ఆరోగ్యం, ఉపాధి, గృహ నిర్మాణం తదితర సంక్షేమ పథకాల అమలులో ఈ గుర్తింపు కార్డు ద్వారా తొలి ప్రాధాన్యత కల్పిస్తామని తెలిపారు. దీంతో ప్రభుత్వ సేవలు త్వరితగతిన అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

ఈ నిర్ణయంతో ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసం పెరగడంతో పాటు విద్యార్థుల హాజరు శాతం, విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయని గ్రామ పెద్దలు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.