ఒంగోలు వైసీపీ కార్యాలయంలో ఘర్షణ..
ఒంగోలు వైసీపీ కార్యాలయంలో ఘర్షణ..
వైఎస్సార్ జయంతి కార్యక్రమంలో రెండు వర్గాల మధ్య ఉద్రిక్తత
నివాళుల కార్యక్రమం సందర్భంగా మహిళా, పురుష కార్యకర్తల మధ్య వాగ్వాదం
ఒకరిపై మరొకరు దాడులు.. మహిళలు జుట్టుపట్టుకుని, పురుషులు పరస్పరం ఘర్షణ
పార్టీ కార్యాలయంలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ప్రకాశం జిల్లా ఒంగోలులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా నిర్వహించిన నివాళుల కార్యక్రమంలో పార్టీ కార్యకర్తల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. దీంతో పార్టీ కార్యాలయం వద్ద కొద్దిసేపు గందరగోళం నెలకొంది.
వైఎస్సార్ 77వ జయంతి సందర్భంగా ఒంగోలులోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించేందుకు కార్యకర్తలు ముందుకు రావడంతో రద్దీ ఏర్పడింది. ఈ క్రమంలో కొందరు పురుష కార్యకర్తలు తమ కాళ్లు తొక్కుతున్నారని మహిళా కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీనిపై ఇరు వర్గాల మధ్య మొదట వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం అది తీవ్రరూపం దాల్చి పరస్పర దాడులకు దారితీసింది.
ఘర్షణలో మహిళలు ఒకరి జుట్టు మరొకరు పట్టుకుని కొట్టుకోగా, పురుష కార్యకర్తలు పరస్పరం తోపులాటకు దిగడంతో పాటు చొక్కాలు చించుకునే వరకు పరిస్థితి వెళ్లింది. దీంతో పార్టీ కార్యాలయంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడున్న ఇతర నాయకులు, కార్యకర్తలు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను విడదీయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
