ఘనంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు

నాగర్‌కర్నూల్ జిల్లా ప్రతినిధి (ఆంధ్రప్రభ): నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలోని బిజినపల్లి మండల కేంద్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి కలిసి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

అనంతరం కేక్ కట్ చేసి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. రైతు సంక్షేమం, పేదల అభ్యున్నతి, విద్య, వైద్య రంగాల అభివృద్ధికి ఆయన చేసిన కృషి రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొని వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఘన నివాళులర్పించారు.