India Iran Relations | భారత్–ఇరాన్ సంబంధాల చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యం
India Iran Relations | భారత్–ఇరాన్ సంబంధాల చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యం
హోర్ముజ్ జలసంధి నుంచి ఇంధన భద్రత వరకు భారత్–ఇరాన్ అనుబంధం
పార్సీల వలసలు, సాంస్కృతిక వారసత్వంతో బలపడిన స్నేహబంధం
India Iran Relations | పశ్చిమాసియా యుద్ధం తర్వాతి దశలో హోర్ముజ్ జలసంధి పునరుద్ధరణ, శాంతి ఒప్పందంపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో… ఈ వ్యూహాత్మక జలమార్గం చుట్టూ కొంతకాలం కొనసాగిన సంక్లిష్టతలు ప్రపంచ దృష్టిని మరోసారి ఆకర్షించాయి. భారతదేశానికి ఈ పరిణామాలు ఓ అంతర్జాతీయ వార్త మాత్రమే కాదు… ఇంధన భద్రత, వాణిజ్యం, వ్యూహాత్మక సమతుల్యత మరియు ఇరాన్‌తో మనకున్న సాంస్కృతిక, చారిత్రక సుహృద్భావనలకు సంబంధించిన సున్నితమైన అంశం కూడా!
ఇరాన్‌తో భారతదేశ సంబంధం సహస్రాబ్దాల పరంపర. మన సనాతన సాంప్రదాయం మరియు ఇరాన్ సంస్కృతికి మూలాధారమైన జథు మతం (జోరాష్ట్రియన్ మతం) మధ్య ఉన్న అనేక సామ్యాలు; మన వేద వాంగ్మయం, వారి మతగ్రంథం అవేస్తాలోని మంత్రశబ్దాలలో గల సామీప్యత; ఉభయ మత విశ్వాసాల్లో పాటించబడే అగ్నిపూజ వంటి క్రతువులు ఒకే మూలభావనల నుంచి ఉద్భవించిన సారూప్యతల ఆధారంగా పరిణతి చెందిన రెండు విశిష్ట నాగరికతలుగా వీటిని పరిగణించవచ్చు.
ఇస్లామిక్ ఆక్రమణల తరువాత పార్సీలుగా పిలువబడే జోరాష్ట్రియన్ మతస్తులు పర్షియా నుంచి భారతదేశానికి వలస రావడం ఈ చిరకాల సంబంధాన్ని బలపరిచే మరో ప్రబల తార్కాణం. తమ మత విశ్వాసాలను ఆక్రమణదారుల నుంచి సంరక్షించుకునేందుకు వారు పూజించే పవిత్ర అగ్నిని తమతో పాటు భారతదేశానికి తీసుకువచ్చారు. ఆ అగ్ని హైదరాబాద్ నడిబొడ్డున పార్సీగుట్టగా పేరొందిన జోరాష్ట్రియన్ ప్రార్థనాస్థలంలో నేటికీ వెలుగుతోంది.
పర్షియా నుంచి శరణార్థులుగా వచ్చిన పార్సీలు తొలుత గుజరాత్‌లో స్థిరపడ్డారు. అనంతరం భారతీయ జీవన స్రవంతిలో మమేకమైపోయారు. తమ మత విశ్వాసాలను పదిలపరచుకుంటూనే దేశ ఆర్థిక, పరిపాలన, రక్షణ, సామాజిక రంగాల్లో విశేష పాత్ర పోషించారు. పారిశ్రామిక రంగంలో చిరస్మరణీయ ముద్ర వేసిన టాటా కుటుంబం ఈ సమాజానికి చెందినదే. తమ తమ రంగాల్లో అద్వితీయ ప్రతిభ కనబరిచిన ఫీల్డ్ మార్షల్ జనరల్ మానెక్‌షా, దాదాభాయి నౌరోజీ, హోమీ బాబా, నానీ పాల్కీవాలా, బొమన్ ఇరానీ, రోహింటన్ మిస్త్రీ వంటి ప్రముఖులు పార్సీలే.
హైదరాబాద్ వంటి చారిత్రాత్మక నగరం రూపకల్పనలో కూడా పర్షియన్ ప్రభావం కనిపిస్తుంది. రూమీ, హఫీజ్, సాదీ వంటి సుప్రసిద్ధ పర్షియన్ కవుల ఆలోచనలు భారతీయ కవిత్వం, తత్వచింతనపై గాఢమైన ప్రభావం చూపించాయి. సూఫీ సంప్రదాయం ద్వారా ఈ భావజాలం భారతీయ సమాజంలో స్థిరపడింది. అలాగే పార్సీ కుటుంబంలో జన్మించిన మెహర్ బాబా వంటి తాత్వికులు భారత ఆధ్యాత్మికతలో ప్రత్యేక స్థానం సంపాదించారు.
హైదరాబాద్, ముంబయి నగరజీవనంలో అంతర్భాగమైన ఇరానీ చాయ్, అయతొల్లా ఖొమైనీ పేరుతో హైదరాబాద్‌లో ఉన్న వీధి, భారత్లో వైద్యవిద్య అభ్యసిస్తున్న వందలాది ఇరాన్ విద్యార్థులు ఉభయ దేశాల మధ్య ఉన్న సామాజిక, సాంస్కృతిక బంధాలను సూచిస్తాయి.
అయితే ఈ సుదీర్ఘ సంబంధం ఆటుపోట్లకు అతీతంగా లేదు. ఇరాన్ భౌగోళికం భారతదేశంపై దురాక్రమణలకు తోడ్పడింది. విశ్వవిజేత అలెగ్జాండర్ పర్షియా ద్వారా భారత భూభాగంలోకి ప్రవేశించాడు. అలాగే పర్షియన్ చక్రవర్తి నాదిర్ షా దాడి, నెమలి సింహాసనం వంటి అమూల్య కళాఖండాలను దోచుకెళ్లడం భారత చరిత్రలో మరచిపోలేని విషాదాలు.
వాణిజ్యరంగంలో మాత్రం ఇరుదేశాల మధ్య సంబంధం నిరంతరం కొనసాగింది. ఇరాన్ దక్షిణ తీరంలోని బందర్ అబ్బాస్ ఓడరేవు ద్వారా భారతదేశంతో వ్యాపార సంబంధాలు కొనసాగించేవారు. అక్కడ ఇప్పటికీ ఉన్న హిందూ దేవాలయం దీనికి సాక్ష్యం. పర్షియన్ గుర్రాలు, ముత్యాలు, పరిమళ ద్రవ్యాలు హోర్ముజ్ జలసంధి ద్వారా మనకు చేరేవి. మన బాస్మతి బియ్యం, తేనీరు వంటి నిత్యావసరాల ఎగుమతులు కూడా నిరంతరంగా సాగాయి. కొన్ని దశాబ్దాల పాటు ఇరాన్ చమురు మనకు ప్రధాన ఇంధన వనరుగా నిలిచింది.
అయితే గత దశాబ్ద కాలంగా అమలవుతున్న ఆర్థిక ఆంక్షలు, మారుతున్న అంతర్జాతీయ సమీకరణాలు, భౌగోళిక రాజకీయ ఒత్తిళ్లు భారత్–ఇరాన్ వాణిజ్యాన్ని ప్రభావితం చేశాయి. అయినప్పటికీ రూపాయి ఆధారిత చెల్లింపు విధానాల వంటి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చమురు దిగుమతులను భారత్ కొంతకాలం కొనసాగించింది.
దాదాపు దశాబ్దకాలం మూతబడిన ఇరాన్ ముడి చమురు దిగుమతులు ప్రస్తుత భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా ఆంక్షలను తాత్కాలికంగా సడలించడంతో పునరుద్ధరించబడ్డాయి. భారీ రాయితీతో ఇరాన్ ముడి చమురును భారత్కు సరఫరా చేసేందుకు ప్రాథమిక స్థాయి చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇలా భారతీయులు–ఇరాన్ ప్రజలు అంతర్జాతీయ సమీకరణాలకు అతీతంగా అనేక రంగాల్లో తమ సంబంధాలను కొనసాగిస్తూనే ఉన్నారు.
ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో భారతదేశం ఉభయతారక విదేశాంగ విధానాన్ని అనుసరిస్తోంది. ఒకవైపు ఇరాన్‌తో మిత్రత్వాన్ని కొనసాగిస్తూనే, మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్ వంటి దేశాలతో కూడా తన సంబంధాలను బలోపేతం చేసుకుంటోంది. మానవతా సహాయం అందించిన అతి కొద్ది దేశాల్లో భారత్ కూడా ఒకటి. అలాగే ఇరాన్‌లో జరిగిన కార్యక్రమానికి భారతదేశం ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాన్ని పంపింది. ఇవన్నీ దీర్ఘకాలిక దృక్పథంతో కూడిన దౌత్య విధానంలో భాగాలే.
ఇరాన్‌ను కేవలం ఒక సమస్యాత్మక దేశంగా చూడటం భారతదేశ ప్రయోజనాలకు ఊతమివ్వదు. అది ఒక చారిత్రక మిత్రదేశం, పాకిస్థాన్, చైనాలను కొంతవరకు కట్టడి చేయగల వ్యూహాత్మక అవసరం, ఒక సాంస్కృతిక బంధం, అన్నిటికీ మించి మన ఇంధన భద్రతకు భరోసా ఇవ్వగలిగిన వాణిజ్య భాగస్వామి. ఇటువంటి విభిన్న కోణాలను సమతుల్యంగా చూడగలిగితేనే భారత విదేశాంగ విధానం సమగ్రంగా ఉంటుంది.
ఇరాన్ చరిత్రను స్పృశించడమంటే ఒక పొరుగుదేశాన్ని మాత్రమే కాదు, మన వారసత్వంలోని ఒక అధ్యాయాన్ని సింహావలోకనం చేసుకోవడం కూడా.
-కృష్ణబాలాజి పల్లపోతు
