మనిషిని సన్మార్గంలో నడిపించే మనోదర్పణం

మనిషిని సన్మార్గంలో నడిపించే మనోదర్పణం

మనోదర్పణం చెప్పే మంచి-చెడుల నిజమైన ప్రతిబింబం

రావణుడు నుంచి అశోకుడి వరకు అంతరాత్మ చెప్పిన జీవన పాఠాలు

అద్దంలో మనిషి యొక్క అందచందాలు మాత్రమే కనిపిస్తాయి. కానీ మనిషి యొక్క తప్పొప్పులను చూపే అద్దం ఇంకొకటి ఉంది. ప్రతి మనిషికీ ఒక మనసు ఉంటుంది. ఆ మనసే మనిషి ఆత్మకు ప్రతిబింబం. ఆ మనసుకు ఒక దర్పణం ఉంటుంది. ఆ దర్పణాన్నే మనోదర్పణం అంటారు. దీన్నే అంతరాత్మ తేజం అని కూడా అంటారు. ఇది అంతర్వీక్షణ శక్తి కలది. ఇది మనిషి యొక్క గుణదోషాలను ఎప్పటికప్పుడు విశ్లేషించి చూపిస్తుంది. మనోదర్పణానికి నిర్దిష్టమైన భౌతిక రూపం లేదు. అందువల్ల దర్పణం కనిపించినట్టు మనోదర్పణం కనిపించదు. ఈ మనోదర్పణం వ్యక్తిలో ఉన్న వివిధ మానసిక చలనాలను తేటతెల్లంగా చూపిస్తుంది. అయితే చూపించే చలనాలలో మంచి, చెడు రెండూ ఉంటాయి.

సాధారణంగా నీతి, నిజాయితీ, నిబద్ధత, క్రమశిక్షణ, మానవత్వం వంటి సద్గుణాలు ఉన్న వ్యక్తి పరోపకారం చేస్తుంటాడు. అలాంటి వ్యక్తిని సమాజం ఎల్లవేళలా గౌరవిస్తుంది. దీనికి విరుద్ధంగా అవినీతి, బంధుప్రీతి, ఈర్ష్య, అసూయ, ద్వేషం, దానవత్వం వంటి దుర్గుణాలతో జీవించే వ్యక్తులు కూడా ఉంటారు. వారు తోటివారి జీవితాలను నాశనం చేస్తుంటారు.

మంచి-చెడుల ప్రవర్తనను మనోదర్పణం ఎప్పటికప్పుడు న్యాయ విశ్లేషణ చేస్తూ సంబంధిత వ్యక్తులకు హెచ్చరిక చేస్తూనే ఉంటుంది. అయితే చాలామంది ఆ బింబ-ప్రతిబింబ సాదృశ్యాలను గ్రహించరు. ఒకవేళ గ్రహించినా పక్కన పెడతారు. కానీ కొద్దిమంది తమ ప్రవర్తనను మనస్సనే అద్దంలో పరిశీలిస్తూ తమ తప్పులను తెలుసుకుంటారు. నష్ట నివారణ చర్యలు చేపడతారు. సాంత్వన పొందుతారు. తమ వల్ల ఏ ఒక్క వ్యక్తికీ నష్టం కలగకూడదనే తపనతో జీవిస్తుంటారు. ఈ విధమైన జీవనం సమాజానికి ఎంతో మేలు చేస్తుంది.

ఒకనాడు లంకాధిపతియైన రావణుడు పరస్త్రీ వ్యామోహంతో సీతాదేవిని అపహరించాడు. మరొకనాడు రారాజైన దుర్యోధనుడు మాత్సర్యంతో పాండవులకు న్యాయంగా దక్కాల్సిన రాజ్యాన్ని ఇవ్వడానికి నిరాకరించాడు. ఆత్మ ప్రబోధానుసారం వీరిద్దరూ ఈ భూమ్మీద నడుచుకోలేదు. అందువల్ల అంతులేని పాపాన్ని మూటగట్టుకున్నారు. కాబట్టి దుర్మరణం పాలయ్యారు. చివరికి లోకం దృష్టిలో దుర్జనులుగా మిగిలిపోయారు.

ప్రపంచ చరిత్రలో ఒక్కొక్క రాజ్యాన్ని జయిస్తూ సామ్రాజ్య విస్తరణ చేపట్టిన హిట్లర్, అలెగ్జాండర్, ముస్సోలిని, నెపోలియన్ వంటి నియంతలు కూడా చివరకు చెడ్డపేరునే మూటగట్టుకున్నారు.

విపరీతమైన రాజ్య విస్తరణ కాంక్షతో ‘దేవానాం ప్రియదర్శి’ అశోకుడు కళింగ యుద్ధం చేశాడు. యుద్ధంలో ఎంతోమందిని మట్టుబెట్టాడు. శత్రుసైన్యంతో పాటు అతని సైన్యం కూడా నేలకొరిగింది. అది చూసి దిగ్భ్రాంతికి లోనయ్యాడు. యుద్ధాల వల్ల కలిగే కష్టనష్టాలను గ్రహించాడు. అయితే చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏమి లాభం? జరగాల్సిన ప్రాణనష్టం జరిగిపోయింది. అయినప్పటికీ అనంతరం తన అంతరాత్మ తేజం చేసిన సూచనను విశ్లేషించుకుని పరివర్తన చెందాడు. శాంతికాముకుడిగా మారాడు. గొప్ప చక్రవర్తిగా కీర్తింపబడ్డాడు.

నిజ జీవితంలో కూడా అహంకారాన్ని తలకెత్తుకుని, హింసను ప్రవృత్తిగా చేసుకుని బ్రతికే వ్యక్తులు తారసపడుతుంటారు. వీరు కూడా తాము చేస్తున్నది తప్పని, ఆత్మసాక్షి వల్లనే తెలుసుకుంటారు. అయినప్పటికీ తమ హింసా ప్రవృత్తిని విడిచిపెట్టరు.

ఎవరైనా అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పవచ్చు. కానీ మనోదర్పణం ముందు నిలబడి అసత్యం పలకలేరు. అందువల్ల ఏ పని చేసినా వ్యక్తి తన మనోదర్పణం ఇచ్చే సూచనలు, హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. తద్వారా మంచి ప్రవర్తన అలవరచుకోవాలి. లేనిపక్షంలో సమాజంలో దుష్టుడిగానే మిగిలిపోతాడు.