భారత నౌకాదళానికి మరో స్వదేశీ శక్తి

భారత నౌకాదళానికి మరో స్వదేశీ శక్తి

ప్రాజెక్ట్-17ఏ కింద నిర్మించిన ఆరో స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్

75 శాతం స్వదేశీ సాంకేతికతతో భారత రక్షణ రంగానికి మరో మైలురాయి

విశాఖసిటీ, ఆంధ్రప్రభ: భారత నౌకాదళ స్వదేశీ యుద్ధ నౌకల నిర్మాణంలో మరో కీలక ఘట్టానికి విశాఖ తూర్పు నౌకాదళం వేదిక కానుంది. భారత నౌకాదళం కోసం ప్రాజెక్ట్-17ఏ కింద నిర్మించిన ఆరో స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ మహేంద్రగిరి (ఎఫ్-38)ను ఈనెల 11న విశాఖపట్నంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో భారత నౌకాదళంలో అధికారికంగా కమిషన్ చేయనున్నారు. ఈ కమిషనింగ్‌తో భారత నౌకాదళ పోరాట సామర్థ్యం మరింత బలోపేతం కానుండగా, స్వదేశీ రక్షణ ఉత్పత్తుల అభివృద్ధిలో భారత్ మరో కీలక విజయం నమోదు చేయనుంది.

తూర్పు కనుమల్లోని మహేంద్రగిరి పర్వత శ్రేణి పేరును ఈ యుద్ధనౌకకు నామకరణం చేశారు. భారత నౌకాదళ చరిత్రలో మహేంద్రగిరి పేరుతో సేవలోకి వస్తున్న తొలి యుద్ధనౌక ఇదే. దృఢత్వం, శక్తి, అచంచల సంకల్పానికి ప్రతీకగా ఈ నౌక నిలుస్తుందని నౌకాదళం పేర్కొంది.

ఈ యుద్ధనౌకను భారత నౌకాదళానికి చెందిన వార్షిప్ డిజైన్ బ్యూరో పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపకల్పన చేయగా, మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్, ముంబై నిర్మించింది. ప్రాజెక్ట్-17ఏ కింద రూపొందిస్తున్న ఏడు అత్యాధునిక స్టెల్త్ ఫ్రిగేట్లలో ఇది ఆరో నౌక. ఇప్పటికే ఈ తరగతికి చెందిన యుద్ధనౌకలు దశలవారీగా నౌకాదళంలో చేరగా, ఇప్పుడు మహేంద్రగిరి కూడా సేవలు అందించనుంది.

స్టెల్త్ సాంకేతికతతో తయారీ…

మహేంద్రగిరి అత్యాధునిక స్టెల్త్ సాంకేతికతతో నిర్మితమైంది. శత్రు రాడార్‌కు సులభంగా కనిపించకుండా ఉండే ప్రత్యేక రూపకల్పన, తక్కువ రాడార్ ప్రతిబింబం, అధిక స్థాయి సర్వైవబిలిటీ, పూర్తి స్థాయి ఆటోమేషన్ వంటి ఆధునిక సదుపాయాలు ఇందులో ఉన్నాయి. యుద్ధ పరిస్థితుల్లో వేగంగా స్పందించే విధంగా అన్ని వ్యవస్థలను సమన్వయం చేశారు.

ఈ ఫ్రిగేట్‌లో కంబైన్డ్ డీజిల్ ఆర్ గ్యాస్ ప్రొపల్షన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అవసరాన్ని బట్టి డీజిల్ లేదా గ్యాస్ టర్బైన్ ఇంజిన్లను వినియోగించే ఈ వ్యవస్థ వల్ల అధిక వేగంతో పాటు దీర్ఘకాలం సముద్రంలో కార్యకలాపాలు నిర్వహించే సామర్థ్యం లభిస్తుంది. యుద్ధ పరిస్థితుల్లో వేగవంతమైన స్పందనతో పాటు సాధారణ గస్తీ సమయంలో ఇంధన పొదుపు కూడా సాధ్యమవుతుంది.

అత్యాధునిక ఆయుధ వ్యవస్థలు…

ఈ యుద్ధనౌకలో ఉపరితల లక్ష్యాలపై దాడి చేసే క్షిపణులు, గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థలు, అత్యాధునిక ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ వ్యవస్థలు, జలాంతర్గాములను గుర్తించి ఎదుర్కొనే యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్ వ్యవస్థలు, సమగ్ర కాంబాట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ వంటి అత్యాధునిక ఆయుధాలు, సెన్సార్ వ్యవస్థలు ఉన్నాయి.

మహేంద్రగిరి గగనతల, సముద్ర ఉపరితల, జలాంతర్గాములపై యుద్ధ కార్యకలాపాలను సమర్థంగా నిర్వహించగలదు. అలాగే సముద్ర భద్రత, శక్తి ప్రదర్శన, మానవతా సహాయం మరియు విపత్తు సహాయక చర్యలు, శోధన-రక్షణ, సముద్రంలో నిరంతర పర్యవేక్షణ వంటి పలు బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించే సామర్థ్యాన్ని కలిగి ఉంది.

75 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మాణం…

మహేంద్రగిరి నిర్మాణంలో 75 శాతానికి పైగా స్వదేశీ పరికరాలు, భాగాలు వినియోగించారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలతో పాటు అనేక సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఈ నిర్మాణంలో భాగస్వాములయ్యాయి. దీంతో దేశీయ రక్షణ పరిశ్రమ బలోపేతం కావడంతో పాటు ఉపాధి అవకాశాలు పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఆత్మనిర్భర్ భారత్’ కార్యక్రమానికి ఈ యుద్ధనౌక మరో నిదర్శనంగా నిలిచింది.

భారత నౌకాదళానికి మరింత బలం

ప్రాజెక్ట్-17ఏ కింద నిర్మితమవుతున్న యుద్ధనౌకలు వరుసగా భారత నౌకాదళంలో చేరుతుండటంతో దేశ సముద్ర రక్షణ సామర్థ్యం మరింత బలోపేతం అవుతోంది. స్వదేశీ యుద్ధనౌకల నిర్మాణంలో భారత్ ప్రపంచ స్థాయిలో తన సత్తా చాటుతోందని రక్షణ వర్గాలు పేర్కొంటున్నాయి.

హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారతదేశం విశ్వసనీయ భద్రతా భాగస్వామిగా తన పాత్రను మరింత సమర్థంగా నిర్వహించేందుకు మహేంద్రగిరి కీలకంగా నిలవనుంది. దేశ సముద్ర ప్రయోజనాల పరిరక్షణ, వాణిజ్య మార్గాల భద్రత, విపత్తు సహాయక చర్యలు, అంతర్జాతీయ సముద్ర భద్రతా కార్యకలాపాల్లో ఈ యుద్ధనౌక కీలక పాత్ర పోషించనుంది.

“మైటీ.. మెజెస్టిక్.. మ్యాచ్‌లెస్” అనే నినాదంతో నౌకాదళ సేవలోకి అడుగుపెడుతున్న ఐఎన్ఎస్ మహేంద్రగిరి భారత నౌకాదళ బలాన్ని మరింత పెంచే శక్తివంతమైన యుద్ధనౌకగా నిలవనుంది.