ప‌ర్యాట‌కుల భ‌ద్ర‌త‌కు అధిక ప్రాధాన్యం

బోట్ల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు మ‌ర‌మ్మ‌తులు..
ఇన్‌లాండ్ వాట‌ర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్ర‌తినిధుల‌తో భేటీ..
ప‌ర్యాట‌కాభివృద్ధికి ప్ర‌భుత్వ చ‌ర్య‌లు..
త్వ‌ర‌లో సోలార్‌, ఎల‌క్ట్రిక‌ల్ బోట్ల ఏర్పాటు..
ఆంధ్ర‌ప్ర‌భ క‌థ‌నానికి స్పందించిన ఏపీటీడీసీ చైర్మ‌న్ నూక‌సాని బాలాజీ..
బోటింగ్ అధికారుల‌తో స‌మీక్ష‌

ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్ర‌ప్ర‌భ : ప‌ర్యాట‌కుల భ‌ద్ర‌తే ప్ర‌ధాన ల‌క్ష్యంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ టూరిజం డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ ప‌నిచేస్తుంద‌ని ఆ సంస్థ చైర్మ‌న్ నూక‌సాని బాలాజీ అన్నారు. కృష్ణాన‌దిలో బోట్ల నిర్వ‌హ‌ణ అంతా ప‌క‌డ్బందీగా సాగుతుంద‌ని ఎటువంటి లోటు పాట్లు లేవ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల ఆంధ్ర‌ప్ర‌భ జిల్లా ఎడిష‌న్‌లో ప‌ర్యాట‌కం..నిర్ల‌క్ష్యం శీర్షిక‌తో ప్ర‌చురిత‌మైన క‌థ‌నంపై బాలాజీ స్పందించారు. త‌క్ష‌ణ‌మే బెరంపార్కులో ఉన్న బోటింగ్ అధికారుల‌తో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించి ఆంధ్ర‌ప్ర‌భ క‌థ‌నంపై చ‌ర్చించారు. ఏయే బోట్లు ప‌నిచేస్తున్నాయి? రెండు బోట్లు ఎందుకు ప‌నిచేయ‌డం లేదు. బోట్ల‌లో ప్ర‌యాణించే ప‌ర్యాట‌కులంతా లైఫ్ జాకెట్లు వేసుకుంటున్నారా? సిబ్బంది ప్ర‌వ‌ర్త‌న త‌దిత‌ర అంశాల‌పై ఆయ‌న సిబ్బందిని మంద‌లించారు. ప్ర‌భుత్వానికి చెడ్డ‌పేరు లేకుండా వ్య‌వ‌హ‌రించార‌ని రాష్ట్రంలో అన్ని శాఖ‌ల్లో టూరిజం ఉత్త‌మ శాఖ‌గా తీర్చిదిద్దాల‌ని సూచించారు. ఈ సంద‌ర్భంగా బాలాజీ ఆంధ్ర‌ప్ర‌భ ప్ర‌తినిధికి ప‌లు అంశాల‌ను వివ‌రించారు.

ఇన్‌లాండ్ వాట‌ర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్ర‌తినిధుల‌తో భేటీ…

బోట్ల నిర్వ‌హ‌ణ మాత్ర‌మే టూరిజం శాఖ చూస్తుంద‌ని బోట్ల సామ‌ర్థ్యం, అనుమ‌తులు, రిజిస్ట్రేష‌న్ త‌దిత‌ర అంశాల‌ను ఇన్‌లాండ్ వాట‌ర్ వేస్ అథారిటీ బాధ్య‌త వ‌హిస్తుంద‌ని చైర్మ‌న్ బాలాజీ స్ప‌ష్టం చేశారు. ఈమేర‌కు మంగ‌ళ‌వారం అథారిటీ ప్ర‌తినిధుల‌తో భేటీ అయి ప‌లు అంశాల‌పై చ‌ర్చించిన‌ట్లు వివ‌రించారు. సాధార‌ణంగా ప్ర‌తిబోటుకు ఐదేళ్ల‌కొక‌సారి డ్రై డాగ్ (మ‌ర‌మ్మ‌తులు) చేప‌ట్టి అన్ని లోటుపాట్లు స‌రిచేసి కొత్త‌దాని త‌ర‌హాలో మార్పులు చేస్తామ‌ని ఆయ‌న వివ‌రించారు. ప్ర‌యాణికుల భ‌ద్ర‌త‌కు అధిక ప్రాధాన్యం ఇస్తామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. సిబ్బంది లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

త్వ‌ర‌లో ఎల‌క్ట్రిక్, సోలార్ బోట్లు..

కృష్ణాన‌దిలో ప్ర‌స్తుతం ఉన్న బోట్ల స్థానంలో త్వ‌ర‌లో ఎల‌క్ట్రిక్‌, సోలార్ బోట్ల‌ను ఏర్పాటుచేయాల‌నే ఉద్దేశంతో ప్ర‌భుత్వం ఉంద‌ని చైర్మ‌న్ నూకసారి బాలాజీ వివ‌రించారు. ఈ అంశంపై ఇప్ప‌టికే ఇటీవ‌ల జ‌రిగిన బోర్డు స‌మావేశంలో కూడా చ‌ర్చించిన‌ట్లు చెప్పారు. ఈ ప్ర‌తిపాద‌న వ‌ల్ల సంస్థ‌కు ఖ‌ర్చులు త‌గ్గుతాయ‌న్నారు.