ఆస్పరి పోలీసుల వేధింపులే కారణమా..?
పోలీస్ స్టేషన్ ఎదుట క్లర్క్ ఆత్మహత్యాయత్నం.. సీఐ వేధింపులేనని కుటుంబ సభ్యుల ఆరోపణలు
ఆస్పరి, ఆంధ్రప్రభ : కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా ఆస్పరి మండలంలోని బిల్లేకల్లు గ్రామానికి చెందిన హనుమంతరెడ్డి అనే సహకార సంఘం క్లర్క్, పోలీసుల వేధింపులు భరించలేక ఆస్పరి పోలీస్ స్టేషన్ ఎదుటే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఆయన ఆదోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
బాధితుడి అన్న రామిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హనుమంతరెడ్డి ఆస్పరి సహకార సంఘంలో క్లర్క్‌గా పనిచేస్తుండగా, రుణాల వసూళ్ల వ్యవహారానికి సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో ఇటీవల ఆయనను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. అనంతరం బిల్లేకల్లు గ్రామంలో వాల్మీకి, ఈడిగ వర్గాల మధ్య జరిగిన ఘర్షణ కేసు విచారణ పేరుతో, ఘటన జరిగిన సమయంలో గ్రామంలో లేకపోయినా ఆస్పరి సీఐ శ్రీనివాస నాయక్ పలుమార్లు పోలీస్ స్టేషన్‌కు పిలిపించారని ఆరోపించారు.
పోలీస్ స్టేషన్లో కాకుండా పోలీస్ క్వార్టర్స్‌లో ఉంచి తీవ్రంగా వేధించారని, అనంతరం వారం రోజుల క్రితం మళ్లీ పిలిపించి పోలీస్ స్టేషన్‌లోని గదిలో లాఠీలతో, కాళ్లతో విచక్షణారహితంగా కొట్టారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. తాను ఏ కేసులోనూ లేనని ప్రశ్నించగా అసభ్య పదజాలంతో దూషిస్తూ, చంపేస్తామని బెదిరించారని రామిరెడ్డి తెలిపారు.
వారం రోజుల తర్వాత మరోసారి పోలీస్ స్టేషన్‌కు రావాలని ఆదేశించడంతో, మళ్లీ వేధింపులకు గురి చేస్తారనే భయంతో కుటుంబ సభ్యులతో కలిసి హనుమంతరెడ్డి పోలీస్ స్టేషన్‌కు వెళ్లినట్లు తెలిపారు. అక్కడ సీఐ మళ్లీ దాడి చేస్తారనే ఆందోళనతో పోలీస్ స్టేషన్ ముందే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని ఆరోపించారు.
పురుగుల మందు తాగిన వెంటనే ఆయన స్పృహ కోల్పోవడంతో పోలీసులు ప్రభుత్వాసుపత్రికి తరలించారని, అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆదోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ సందర్భంగా హనుమంతరెడ్డి భార్యతో పాటు కుటుంబ సభ్యులు సీఐని కలిసి “మా భర్తను ఎందుకు పదేపదే పిలిచి వేధిస్తున్నారు?” అని ప్రశ్నించగా, సీఐ శ్రీనివాస నాయక్ అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా మహిళల పట్ల కూడా అనుచితంగా ప్రవర్తించి బూటుకాలితో తన్నారని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు నిష్పాక్షిక విచారణ జరిపి, వాస్తవాలను వెలికితీసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు డిమాండ్ చేశారు.
