బాలికల క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే..

మైలవరం, ఆంధ్రప్రభ : మైలవరం ఎస్.ఎస్.కె పబ్లిక్ స్కూల్లో నిర్వహిస్తున్న బాలికల క్రికెట్ టోర్నమెంట్‌ను మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు మంగళవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కేకు కట్ చేసి, బాలికలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ టోర్నమెంట్‌ను ప్రారంభించారు. బాలికలలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు మాట్లాడుతూ, విద్యతో పాటు క్రీడలు కూడా విద్యార్థుల సమగ్ర వికాసానికి ఎంతో అవసరమన్నారు.

ముఖ్యంగా బాలికలు అన్ని రంగాల్లో రాణిస్తున్న నేటి పరిస్థితుల్లో క్రీడల్లోనూ ప్రతిభ కనబరచి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, జట్టు స్ఫూర్తి, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. విద్యార్థులకు ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని, నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు.

అనంతరం క్రికెట్ మైదానంలోకి వెళ్లిన ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు బ్యాటింగ్ చేసి టోర్నమెంట్‌కు శ్రీకారం చుట్టగా, విద్యార్థినులు, ఉపాధ్యాయులు హర్షధ్వానాలతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ. జనసేన పార్టీ ఇంఛార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ), పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, క్రీడా నిర్వాహకులు, తల్లిదండ్రులు, విద్యార్థినులు పాల్గొన్నారు.